TSLPRB: నియామకాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. సుమారు 17 వేల పోస్టుల భర్తీ నేపథ్యంలో తొలిదశ నుంచే అక్రమాలకు ఆస్కారమివ్వకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారు. గతంలో ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న దాఖలాలుండటంతో అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోటీలో ‘ముందు నుంచి చివరిదాకా ఒకే అభ్యర్థి’ ఉండేలా బయోమెట్రిక్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పోటీ జరిగే ప్రతీ దశలో అభ్యర్థి వేలిముద్రలు(బయోమెట్రిక్) తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. ప్రాథమిక రాతపరీక్షకు హాజరైనప్పటి నుంచి మొదలుకొని మైదానంలో పీఎంటీ, పీఈటీలాంటి శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు తుది రాతపరీక్ష వరకు మొత్తం 9సార్లు బయోమెట్రిక్ తీసుకోనున్నారు.
ఆర్టీఏ డేటాబేస్ లింక్‌తో లైసెన్స్‌ల తనిఖీ: పోలీస్‌శాఖలో డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉంటే మూడు మార్కుల్ని అదనంగా కలపనున్నారు. ఈ క్రమంలో రవాణాశాఖ నుంచి తీసుకున్న ఆర్టీఏ డేటాబేస్ లింక్‌లో అభ్యర్థుల లైసెన్స్‌లను తనిఖీ చేసి నిర్ధారించుకోనున్నారు.
డిజిటల్ థియోడలైట్ నామమాత్రమే: షాట్‌పుట్, లాంగ్‌జంప్‌లాంటి పరీక్షల్లో క్రితం సారి డిజిటల్ థియోడలైట్ పరికరాల్ని వినియోగించారు. టెలిస్కోపిక్ పరిజ్ఞానం కారణంగా అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ దూరం దూకారు..? బాల్‌ను ఎంత దూరం విసిరారు..? కచ్చితమైన కొలతలకు ఆస్కారముండేది. అయితే ఈసారి ఈ రెండు పోటీల్లో గరిష్ఠదూరం కాకుండా నిర్ణీతదూరాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఈ పరికరాల్ని నామమాత్రంగా వినియోగించనున్నారు.
సీసీ కెమెరాల నిఘా.. రిస్ట్‌బ్యాండ్ పరిజ్ఞానం: ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 12 మైదానాల్లో పీఎంటీ, పీఈటీలాంటి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా మైదానాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఒక్కో మైదానంలో సుమారు 130 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణకు ఉంటారు. అభ్యర్థుల పరుగుపందేన్ని క్షుణ్ణంగా కెమెరాల్లో రికార్డు చేయనున్నారు. తమకొచ్చిన మార్కులపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే కెమెరా ఫీడ్ ద్వారా పరిశీలించనున్నారు. అలాగే అభ్యర్థులు మైదానంలో అడుగుపెట్టిన వెంటనే చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) పరిజ్ఞానంతో కూడిన రిస్ట్‌బ్యాండ్ తగిలించనున్నారు. దీనివల్ల అభ్యర్థి మైదానంలో ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడనేది కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంటుంది.
దేశంలో మరెక్కడా లేని సాంకేతికత
దేశంలో మరే పోలీస్‌శాఖ వినియోగించని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. పోటీల్లో తమకు అన్యాయం జరిగిందని ఏ అభ్యర్థి భావించకూడదనేదే మా భావన. అందుకోసమే భౌతిక పరిశీలనతో పాటు సాంకేతికతతో ఈవెంట్లను రికార్డు చేస్తున్నాం. ఎవరైనా అభ్యంతరం తెలిపినా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సాంకేతిక పరిజ్ఞానంతో నివృత్తి చేస్తాం.
- వి.వి.శ్రీనివాసరావు, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్
ఇవీ చూడండి: ఐస్‌క్రీం తిని ఫ్లేవర్ చెప్తే చాలు.. మీరే లక్షాధికారి..!