Land Values in TS: రాష్ట్రంలో ఇక ప్రతి ఏడాదీ వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది . స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు అధికారం కల్పించింది. ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. రాబడి పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి మండలి ఉపసంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఏడేళ్లుగా మార్కెట్ విలువలను సవరించకపోవడంతో రాష్ట్ర రాబడికి నష్టం జరిగిందని భావించారు. గత ఏడాది పెంచిన మార్కెట్ విలువకు.. బహిరంగ మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాలకు చాలా అంతరం ఉందని గుర్తించారు. అందుకే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మార్కెట్ విలువ సవరణ ప్రక్రియ చేపట్టారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువలను సవరించేలా గతంలో ఉత్తర్వులు ఉండగా.. తాజాగా వాటిని సవరించారు.
ప్రాతిపదికకు పలు అంశాలు
- ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించకపోవడం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం రెట్టింపు కావడం, సాగునీటి ప్రాజెక్టులతో నీటి వసతి పెరగడంతో భూముల విలువ భారీగా పెరగడం, రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, పర్యాటకం, స్థిరాస్తి రంగంలో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, వివిధ రంగాల్లో అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
- హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటు, తాజాగా వస్తున్న రీజనల్ రింగ్‌రోడ్డు నేపథ్యంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంది.
- మౌలిక సదుపాయాల కల్పనతో జరుగుతున్న అభివృద్ధి, హైదరాబాద్ నలుదిశలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ జోరు నేపథ్యంలో మార్కెట్ విలువల సవరణకు సర్కారు మొగ్గుచూపింది. ఇందులో భాగంగానే ఏడాదికి ఒక సారి సవరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ఎప్పుడైనా మార్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తి
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపుపై కసరత్తు పూర్తి చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ... ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆమోదముద్ర పడగానే క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓల నేతృత్వంలోని 'విలువల పెంపు కమిటీలకు' పంపించనుంది. గత ఏడాది విలువలు పెంచిన సమయంలో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు ఆయా కమిటీలు నాలుగు రోజుల సమయం తీసుకున్నాయి. ఈసారి కూడా అంతే సమయం పట్టొచ్చని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేయాలంటే ఇవాళ సాయంత్రంలోపు జిల్లా, రెవిన్యూ డివిజన్ స్థాయి కమిటీల వద్దకు ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉంటుంది.
అదిరేలా రిజిస్ట్రేషన్ల రాబడి
రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 20 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారుల అంచనా. ఇందులో 25 నుంచి 30శాతం వ్యవసాయ భూములు కాగా.. మిగిలిన 70 నుంచి 75 శాతం వ్యవసాయేతర ఆస్తులు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక ఏడాది 12 వేల కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వస్తే మరో మూడువేల కోట్లు అదనపు ఆదాయం వస్తుందని లెక్కలు కట్టారు.
ఇదీ చదవండి: