Talasani Srinivas in Sankranthi Celebrations : రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తలసాని.. మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవే పండుగలు అని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే దానం చిన్నారులకు గాలిపటాలను పంపిణీ చేసి.. వారితో పాటు పతంగులను ఎగుర వేశారు. కొత్త సంవత్సరంలో జనవరి నెలలో ముందుగా వచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి అంటే మూడు రోజుల పాటు ఆనందంగా జరుపుకునే పండుగ అని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న.. పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరారు.
మన సంస్కృతి, ఆచారాలు, పండుగల విశిష్టతను తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కైట్ ఫెస్టివల్‌ను రెండు రోజులు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
"సంక్రాంతి వచ్చిందంటే ఆడపడుచులు రంగురంగుల ముగ్గులతో తమ ఇంటి ముంగిళ్లు అలంకరించి గొప్పగా చేసుకుంటారు. అబ్బాయిలు అంత గాలి పటాలతో వేడుకలు జరుపుకుంటారు. మా చిన్నతనంలో పండుగను అందరం కలిసి జరుపుకునే వాళ్లం. ఇప్పుడు పండుగ సందడి అంతగా కనిపించడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల గురించి చెప్పాలి". - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
ఇవీ చదవండి: