Minister Srinivas Goud fires on bjp: రాష్ట్రాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవాలని మోదీ చూస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను ఈడీ పేరుతో అణచివేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో భాజపా ఆటలు కొనసాగవని స్పష్టం చేశారు. మాట్లాడేహక్కు భారతీయ పౌరులకు ఉందని తెలిపారు. ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు మంత్రి పలికారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు పాలమూరు వేదికగా మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందా అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ టూరిస్ట్‌ల్లాగా రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులు రాష్ట్రంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ పర్యటనలో కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
మహేంద్రనాథ్ పాండే జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులను తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదివి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. వలసల జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. నారాయణపేటకు సైనిక స్కూల్ ఇస్తామని హామీ ఏమైందని మంత్రి ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ప్రజల గొంతు నొక్కడేమా అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో తామే ఉండాలనేది భాజపా ఆలోచనగా ఉందని పేర్కొన్నారు. దీనికి ప్రజలు ఒప్పుకోరని తిరుగుబాటు చేస్తారని .. ప్రకృతి కూడా సహకరించదని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
భాజపా నేతలు అబద్దాలు మాట్లాడడం మానుకోవాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హితవు పలికారు. కేసీఆర్ రాష్ట్రానికి ఏమి చేశారో భాజపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే తెలుస్తోందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సూచించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ సమాజమంతా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పారు.
"ప్రధానమంత్రి పాలమూరుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. కేంద్రమంత్రులు రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్‌లా వస్తున్నారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదివి వెళ్లిపోతున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పనులవల్లే మహబూబ్‌నగర్ జిల్లా స్వరూపం మారింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. అదే తుంగభద్ర నదిపైనా ఉన్న అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించే వ్యక్తి లేకుండా గొంతుకలను తొక్కేయాలని చూస్తున్నారు. ఈడీ పేరుతో అణచివేస్తున్నారు. దేశంలో ఎక్కడనైనా మీ ఆటలు కొనసాగుతాయి కాని తెలంగాణలో మాత్రం సాగవు." - శ్రీనివాస్‌గౌడ్ మంత్రి
ఇవీ చదవండి:విద్యారంగానికి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావట్లే.. : మంత్రి సబితా..