Minister KTR Legal Notices to Revanth Reddy and Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లీకేజీ వ్యవహారంలో నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు చేసిన ఆరోపణలపై వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఎదుర్కొవాల్సి వస్తుందని లీగల్ నోటీసుల్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు: తన న్యాయవాది ద్వారా కాంగ్రెస్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ఇద్దరు టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని విమర్శించారు. సుదీర్ఘ కాలంపాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న.. దురుద్దేశంతో పదే పదే అబద్దాలను మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు.
TSPSC Paper Leakage Case: ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లు 499, 500 ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించినట్లు పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. తనపై ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా నోటీసుల్లో కేటీఆర్ ప్రస్తావించారు.
కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి: టీఎస్పీఎస్సీ లీకేజీ వలన వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరించారు. ఇందుకు సంబంధించిన మంత్రి కేటీఆర్‌ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కష్టపడి చదివి నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోర్టు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ ఎలా చెప్పారు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కోర్టు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ మంత్రి కేటీఆర్ ఎలా చెప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో మొదటి నుంచి మంత్రి కేటీఆర్ వ్యవహర శైలి భిన్నంగా ఉందని చెబుతున్నా.. సిట్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అసలు ఈ కేసుతో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెప్పుతారన్నారని నిలదీశారు. సిట్ చెప్పాల్సిన వివరాలను మంత్రి ఎలా చెపుతున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ సిట్ అధికారి అయినట్లుగా వివరాలన్నీ చెప్పారని.. మంత్రి కనుసన్నల్లోనే దర్యాప్తు మొత్తం జరుగుతోందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని సిట్ అధికారులను ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: