CS Meeting With Employees:రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారీగా ఆప్షన్స్ ఇచ్చి కేటాయింపునకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై టీఎన్జీవో, టీజీవో సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో సీఎస్ చర్చించారు.
ఆ జిల్లాలకే మొదటి ప్రాధాన్యం
CS with TNGOS: టీఎన్జీవో, టీజీవోలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లా స్థాయి ఉద్యోగుల సంఘాలను కూడా కేటాయింపు సమయంలో ఆహ్వానించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో లేని జిల్లాల్లో మొదటి దశలో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేసిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, టీజీవో రాష్ట్ర ప్రెసిడెంట్ మమత, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: