తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్(CONGRESS) ముఖ్యనాయకుల సమావేశం వాడీ-వేడీగా సాగింది. పీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) లేకుండా ఇందిరా భవన్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో కార్యనిర్వహక అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీకి చెందిన పలు అంశాలు, అభ్యంతరాలు మాణికం ఠాగూర్ దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్య నేతల సమావేశం
గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల నిర్వహణ కోసం నియమించిన సమన్వయకర్తల సమావేశంలో నాయకులు అంతా పాల్గొని దిశ నిర్దేశం చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయటకు వెళ్లారు. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌తో ముఖ్య నేతలు సమావేశమయ్యారు.
రేవంత్‌పై ఆరోపణలు
రాష్ట్రంలో సభల తేదీలను ఏకపక్షంగా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుని ప్రకటిస్తున్నారని పలువురు ప్రస్తావించారు. ఈ విషయంలో రేవంత్ అనుకూల, ప్రతికూల నాయకుల మధ్య చర్చ జరిగింది. ముఖ్యమైన నిర్ణయాలు ప్రతి శనివారం జరిగే సమావేశంలో చర్చించుకుని ముందుకెళ్లాలని... చిన్న చిన్న నిర్ణయాలు అధ్యక్షుడు తీసుకోవచ్చునని ఠాగూర్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీల్లో ఎక్కువగా పీసీసీ అధ్యక్షుడీవే ఉంటున్నాయని పలువురు సీనియర్ నేతలు ఆరోపించారు. సభాప్రాంగణం మధ్యలో ఫ్లెక్సీలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఠాగూర్... స్టేజి వైశాల్యము తగ్గించి తగు సూచనలు చేశారు. పాసులు లేనివారు స్టేజి మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మాణికం ఠాగూర్ కామెంట్స్
ప్రతి శనివారం జరిగే రాజకీయ వ్యవహారాల ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ పీసీసీలు, మాజీ మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులను ఆహ్వానించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఠాగూర్... ప్రతి శనివారం వారందరిని సమావేశాలకు ఆహ్వానించడం కష్టమని తేల్చేశారు. కమిటీల్లో వారికి స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 24న గజ్వేల్‌లో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాటు చేయాలని పీసీసీ ప్రకటించగా... కేవలం నాలుగు రోజులే ఉన్నందున ఏర్పాట్లకు ఇబ్బందులు ఉంటాయని ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆ సభను వాయిదా వేసుకుని... అదే సమయంలోనే మేడ్చల్‌లో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా... పార్టీలో అంతర్గతంగా ఎన్నో అంశాలు చర్చకు వస్తాయని అవన్నీ బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: WATER PLUS TO GHMC: హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ వాటర్ ప్లస్ ధ్రువపత్రం