కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమ అఖిలప్రియ.... మాజీ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుని కేసులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని అత్యంత విలువైన 48 ఎకరాల భూమి విషయంలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఒక్కటయ్యాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సుబ్బారెడ్డి దివంగత భూమా నాగిరెడ్డికి ప్రాణ స్నేహితుడిగా ఉండేవారు. స్థిరాస్తి వ్యాపారాలేవైనా ఇద్దరూ కలిసే చేసేవారు. నాగిరెడ్డి మరణానంతరం స్థిరాస్తి సమస్యలే భూమా అఖిలప్రియతో విభేదాలకు కారణమయ్యాయి.
సుబ్బారెడ్డిపై హత్యాయత్నానికి సంబంధించి కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్‌లో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌పై గతంలో కేసు నమోదు కాగా.. వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గతేడాది మార్చి 12న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిని తుపాకీతో కాల్చి చంపడానికి సుపారీ గ్యాంగ్ ప్రయత్నించిందని అభియోగం. మార్చి 21న మరోసారి రామిరెడ్డి, రవిచంద్రారెడ్డి, పకీర్ అనే ముగ్గురు సుబ్బారెడ్డిని హత్య చేయడానికి కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు.
హత్య చేయడానికి రూ.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించడం వ్ల భూమా అఖిల ప్రియ, భార్గవరామ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏవీని గతంలో పోలీసులు 27 కేసుల్లో నిందితుడిగా చేర్చినా, అవన్నీ న్యాయస్థానంలో వీగిపోయాయి. ఆళ్లగడ్డలో గతేడాది డిసెంబరు 20న వీహెచ్‌పీ నాయకుడు, సమీప బంధువైన త్రినేత్ర మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సుబ్బారెడ్డి నిందితుడిగా ఉన్నారు.
సురక్షితంగా వదిలినందుకు సంతోషం: ప్రవీణ్‌రావు సోదరుడు ప్రతాప్‌రావు
అపహరణకు గురైన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఉందని వారి సోదరుడు, న్యాయవాది ప్రతాప్‌రావు పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రవీణ్‌రావు కుటుంబసభ్యులు ఫోన్ చేసి తమ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయని తెలిపారన్నారు. తన సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకున్న వారి ఇంటి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా వచ్చిన వారు అధికారుల్లా కనిపించారని తెలిపారు. కొద్దిసేపటికి మళ్లీ సెల్‌ఫోన్‌లో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఇంట్లో ఎవరూ కనిపించలేదని, ఫోన్ చేసినా కలవలేదన్నారు. 45 నిమిషాల అనంతరం ఇంట్లోని మహిళలు ఫోన్ చేయడంతో కిడ్నాప్ విషయం తెలిసిందని చెప్పారు. తాను ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మాలోత్ కవితలకు ఫోన్లో చెప్పి రాత్రి 10 గంటల ప్రాంతంలో నగరానికి వచ్చానన్నారు. బాధితులను చిలుకూరులోని ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి వారి చేత పలు దస్తావేజులపై సంతకాలు చేయించుకున్నారని ప్రతాప్‌రావు తెలిపారు. రాయలసీమ గూండాయిజం ఇక్కడ నడవదని ఆబ్కారీ, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఆ భూములు మా నాన్న కొన్నవి.. ఇవ్వాల్సిందే'