BJP Corporators protest at Jalamandali : హైదరాబాద్ జలమండలి కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీలో తీవ్ర నీటిసమస్య ఉందని... పలుచోట్ల కలుషిత నీరు వస్తుందని ఆందోళనకు దిగారు. అలాగే వాటర్‌బోర్డులో సిబ్బందిని పెంచాలన్నారు. వాటర్ బోర్డుకు రూ.500 కోట్లు కేటాయించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ మేరకు నిధులు ఇవ్వాలన్నారు. ధర్నాకు దిగిన కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. వాటర్ బోర్డు ఎండీతో చర్చించాలని వాదించారు. జలమండలి ఎండీ దాన కిషోర్‌ను కలవడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వివరించేందుకు వస్తున్న కార్పొరేటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
వాటర్ బోర్డు పరిస్థితి అధ్వానం
సీఎం కేసీఆర్ ఛైర్మన్‌గా వ్యవహారిస్తున్న వాటర్ బోర్డు పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. బస్తీలు, కాలనీల్లో ఐదారు రోజులకోమారు నీళ్లు వస్తున్నాయని... నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్లు కోరారు. జలమండలి కార్యాలయం వద్ద కార్పొరేటర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు ఐదుగురు కార్పొరేటర్లను లోపలికి అనుమతించారు. వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ లేకపోవడంతో మరో అధికారికి వినవిపత్రం సమర్పించారు.
పోలీసుల బందోబస్తు
భాజపా కార్పొరేటర్ల ధర్నాకు అనుమతి లేదంటున్న పోలీసులు.. గతంలో జీహెచ్ఎంసీ ముట్టడి ఉద్రిక్తత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. జలమండలి కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవలే సర్వసభ్య సమావేశం నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాజపా కార్పొరేటర్లు.. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా ముందే నిలువరించేలా జలమండలి కార్యాలయానికి పోలీసుల వలయం ఏర్పాటు చేశారు.
జీహెచ్ఎంసీలో ఉన్న సివరేజీని చేతులెత్తేశారు. పూర్తిగా సివరేజీని గాలికొదిలేశారు. కార్పొరేటర్లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. జనాలు మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డిమాండ్ ఒక్కటే. యూజీడీ లైన్లు కొత్త లైన్లు శాంక్షన్ చేయాలి. రిపేర్లు చేయించాలి. జీహెచ్ఎంసీని జీహెచ్ఎంసీలాగే ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చేది వర్షాకాలం. కాలనీల్లో డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... పూర్తిగా నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ జలమండలికి అప్పగించారు. వాళ్లు అసలు పట్టించుకోవడం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
-భాజపా కార్పొరేటర్లు