స్థానిక సంస్థల్లో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా ఉత్తమ సేవల గుర్తింపు కోసం జిల్లా పరిషత్తు, మండల పరిషత్‌లతో పాటు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ స్థాయిలో దీన్‌దయాళ్ సశక్తికరణ్ పేరిట ప్రత్యేక పురస్కారాలను అందజేస్తోంది. నగదుతోపాటు ప్రశంసా పత్రం ఇస్తోంది. ప్రధానంగా పారదర్శకత, ప్రభుత్వ పథకాల సద్వినియోగం, అక్షరాస్యత, మొక్కల పెంపకం, నిరంతరం పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ, ఆన్‌లైన్ సేవలు, క్రమం తప్పకుండా సభలు, సమావేశాల నిర్వహణ లాంటి దాదాపుగా 31 విషయాలతో కూడిన ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకొని పురస్కారానికి ఎంపిక చేయడం ఆనవాయితీ. గత సంవత్సరం సెప్టెంబరులో కేంద్రం ప్రకటించిన జాబితాకు అనుగుణంగా రుయ్యాడి పంచాయతీ అంశాలను క్రోడీకరించింది. రెండు నెలల కిందట జిల్లా అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బుధవారం కేంద్రం ప్రకటించిన జాతీయస్థాయి పురస్కారాల్లో రుయ్యాడికి చోటు దక్కింది.
నిరంతర నీటి సరఫరా
రుయ్యాడిలో 60 వేల లీటర్లది ఒకటి, 40 వేల లీటర్ల సామర్థ్యంతో కూడిన మరొక రెండు రక్షిత మంచినీటి ట్యాంకుల ద్వారా గ్రామస్థులకు నీటి సరఫరా జరుగుతోంది. ప్రత్యేక సిబ్బందితో ఎప్పటికప్పుడు ట్యాంకుల్లో క్లోరినేషన్ జరుగుతుండటంతో జాబితాలో మార్కులు రావడానికి దోహదం చేసింది.
నామినేటెడ్ సర్పంచి..
పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం రుయ్యాడి సర్పంచి స్థానం ఎస్టీలకు రిజర్వ్ అయింది. పది వార్డు స్థానాల్లో అయిదు ఎస్టీలకు, మరో అయిదులో రెండు జనరల్ మహిళలు, మరో మూడు జనరల్‌గా రిజర్వ్ అయ్యాయి. వాస్తవానికి రుయ్యాడిలో ఎస్టీ జనాభా లేదు. దాంతో గ్రామస్థులంతా పంచాయతీరాజ్ నిబంధనలకు మిగిలిన జనరల్ సభ్యులతో కలిపి పూండ్రు పోతారెడ్డిని నామినేటెడ్ సర్పంచిగా ఎన్నుకున్నారు. పంచాయతీ కార్యదర్శిగా అభవ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సఖ్యత ఉండటం గ్రామానికి మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఆన్‌లైన్ సేవలు..
మూడేళ్లుగా పంచాయతీకి సంబంధించిన లావాదేవీలతోపాటు దుకాణాలకు అనుమతి మంజూరు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలాంటి పనులను ఆన్‌లైన్ క్రోడీకరణతో నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి నెల పంచాయతీ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించడం గ్రామస్థుల్లో ఐక్యతకు దోహదం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన హస్సేన్, హుస్సేన్ పీరీల నిర్వహణ గ్రామస్థులంతా నియమినిష్ఠలతో నిర్వహించడం మతసామరస్యాన్ని చాటిచెబుతోంది. గ్రామ అవసరాల కోసం గ్రామం తరఫున అయిదుగురు సిబ్బందిని నియమించి ఒకరికి నెలకు రూ.8,500 చొప్పున పంచాయతీ ద్వారానే వేతనాలు ఇస్తున్నారు. పురస్కారం రావడం పట్ల సర్పంచి పోతారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మున్ముందు మరింత ప్రగతి సాధిస్తామని చెప్పారు.
"గ్రామ పంచాయతీ పరిధిలోని మురుగు కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తారు. ప్రతిరోజు వీధులు ఊడ్చేస్తారు. రోజుకు 200 కిలోల చెత్తను గ్రామంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అక్కడ వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేస్తారు. ఆ ఎరువును వివిధ కార్యక్రమాల్లో భాగంగా రుయ్యాడిలో నాటిన 10 వేల మొక్కలు వినియోగిస్తారు. చెత్త తరలింపునకు ప్రత్యేకంగా రెండు రిక్షాలను ఏర్పాటుచేయడం పథకం రావడానికి కలిసివచ్చింది."
------------------------------------- ఎల్.అభయ్ కుమార్, కార్యదర్శి
"గ్రామ జనాభా 873 కాగా.. కుటుంబాలు 457 ఉన్నాయి. 51 మహిళా సంఘాలు ఉన్న తమ గ్రామానికి అవార్డు రావడం ఆనందంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకొని జ్ఞాపిక ఇవ్వడం మాపై మరింత బాధ్యత పెరిగింది".
------------------------పోతారెడ్డి, సర్పంచి, రుయ్యాడి
ఇదీ చదవండి: గ్రామంలో అథ్లెటిక్స్‌కు శిక్షణ..శభాష్ అనిపించుకుంటున్న యువకుడు