ప్రతిష్టాత్మక డేవిస్‌కప్ టోర్నీ వేదిక మార్పుపై నవంబరు 4 వరకు వేచి చూస్తామని చెప్పాడు భారత టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లకు భద్రత అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దాయాది దేశం వెళ్లేందుకు బృందం తరఫున మరోసారి నిరాసక్తత వ్యక్తం చేశాడు. ఇప్పటికే వేదిక మార్చాలని అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్)కు లేఖ రాయగా.. దీనిపై స్పందన రావాల్సి ఉంది.
మరోసారి డ్రా...
భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ.. వేదిక మార్పుపై పునఃసమీక్షించాలని కోరారు ఆటగాళ్లు. గతంలో ఈ మ్యాచ్‌లను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించాలని అనుకున్నా.. భారత టెన్నిస్ సంఘం ఫిర్యాదుతో తేదీ మార్చారు. తర్వాతి డ్రా నవంబర్ 29, 30 లేదా డిసెంబర్ 1న ఇస్లామాబాద్‌లో తీయనున్నారు.
గతంలో వేదిక మార్చాలని భారత టెన్నిస్ సంఘం కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించింది ఐటీఎఫ్. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహిస్తే ఆడేందుకు మహేశ్ భూపతి సారథ్యంలో ఇప్పటికే ఆరుగురు ఆటగాళ్ల జట్టు సిద్ధంగా ఉంది.