అత్యంత ఉత్కంఠగా సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా 4 గంటల 57 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. స్విస్ దిగ్గజ క్రీడాకారుడు ఫెదరర్‌పై 7-6 (7/5), 1-6, 7-6 (7/4), 4-6, 13-12 (7/3) పాయింట్ల తేడాతో గెలుపొందాడు జకో.
ఫెదరర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం ద్వారా జకో విజయం సొంతం చేసుకున్నాడు. ఐదోసారి వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడాడు.
ఈ మ్యాచ్‌లో ఫెదరర్ మొదటి నుంచీ గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. తొలి సెట్‌ను 6-7 వరకూ తీసుకెళ్లి ఓడిపోయాడు. రెండో సెట్‌ను 6-1 తేడాతో అలవోకగా గెల్చుకొని జకోవిచ్‌కు సవాలు విసిరాడు. మూడో సెట్‌లోనూ ప్రత్యర్థికి చెమటలు పట్టించిన ఫెదరర్ ఆ సెట్‌ను స్వల్ప తేడాతో కోల్పోయాడు.
నాలుగో సెట్‌లో తిరిగి పుంజుకున్న ఫెడెక్స్ 6-4 తేడాతో కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ఇద్దరి మధ్య ఆద్యంతం హోరాహోరీ పోరు కొనసాగి చివరికి టై బ్రేక్‌కు వెళ్లింది. ఒక గేమ్ జకోవిచ్ గెలిస్తే... మరో గేమ్ ఫెదరర్ గెలుస్తూ వచ్చాడు. చివరకు రెండు గేమ్ పాయింట్లు ఆధారంగా జకో విజయాన్ని అందుకున్నాడు.
71 ఏళ్లలో గేమ్ పాయింట్ల ఆధారంగా విజయం సాధించిన తొలి టెన్నిస్ క్రీడాకారుడిగా జకోవిచ్ నిలిచాడు.
ఇది చదవండి: వింబుల్డన్: సెరెనాపై హలెప్ సంచలన విజయం