ఇప్పటి వరకు ఆసియా కప్ రెండు మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ. అయితే బంతులను ఎక్కువగా తీసుకున్నప్పటికీ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడని అతడి అభిమానులు చెబుతున్నారు. తొలుత పాక్‌పై 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరగడంతో తొలి ఓవర్‌లోనే కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇక రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 44 బంతుల్లో 59 పరుగులు చేశాడు. 40 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిగతా నాలుగు బంతుల్లో మరో తొమ్మిది పరుగులను జోడించాడు. ఇందులో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇలా ఆడినప్పటికీ కోహ్లీ బ్యాటింగ్ ఆందోళనకరంగానే ఉందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ వ్యాఖ్యానించడం గమనార్హం. విరాట్ బ్యాటింగ్‌లో బెరుకుదనం కనిపించిందని పేర్కొన్నాడు.
"విరాట్ కోహ్లీ బాగానే ఆడినప్పటికీ అతడి బ్యాటింగ్‌లో మునుపటి పట్టు లేదు. అందుకే కోహ్లీ బ్యాటింగ్ గురించి నాకు ఆందోళనగా ఉంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో విరాట్ మాదిరిగానే మరొక బ్యాటర్ 140 స్ట్రైక్‌రేట్‌తో ఆడి ఉండుంటే భారత్ ఇబ్బందుల్లో పడి ఉండేది. అయితే.. సూర్యకుమార్ భారీ ఇన్నింగ్స్ ఆడటం మంచిదైంది. ఒకవేళ సూర్య ఆడకపోయుంటే భారత్ 150-160 పరుగుల మధ్య ఆగిపోయి ఉండేది. అప్పుడు హాంకాంగ్ గెలిచే ప్రమాదం లేకపోలేదు" అని జాఫర్ వివరించాడు. కోహ్లీ నెమ్మదిగా ఆడినప్పటికీ.. మరోవైపు సూర్యకుమార్ కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు చేయడంతో భారత్ 192/2 భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం హాంకాంగ్ 152/5 చేసి 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత్ అగ్రస్థానంతో సూపర్-4కి దూసుకెళ్లింది.
ఇదీ చూడండి: ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో మరో ముగ్గురు స్టార్ హీరోలు, ఇక ఫ్యాన్స్‌కు పండగే