ఏళ్లు గడుస్తున్న కొద్ది క్రికెట్లో బ్యాటింగ్ ప్రమాణాలు మారుతున్నాయి. ముఖ్యంగా టీ20లు వచ్చాక బ్యాటింగ్ విధానమే పూర్తిగా మారిపోయింది. బ్యాట్స్‌మెన్ ప్రధానంగా బాదుడు పైనే దృష్టి పెడుతున్నారు. కొత్త కొత్త షాట్లతో.. అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసాలతో మైమరిపిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ వీటికి వేదికగా మారింది. ఈ లీగ్‌లో హెలికాప్టర్ షాట్ నుంచి దిల్‌స్కూప్ వరకూ ఇలా ఎన్నో విన్నూత్న షాట్లు చూశాం. పవర్ హిట్టింగ్తో అలవోకగా సిక్సర్లు బాదుతుంటే ఆస్వాదించాం.
రేంజ్ హిట్టింగ్ అంటే?
ఈసారి ఇంకో కొత్త షాట్ అలరిస్తోంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. బంతికి కళ్లకు మధ్య చక్కని సమన్వయంతో.. బ్యాట్ స్వింగ్‌ను ఉపయోగించుకుని బంతిని కచ్చితంగా స్టాండ్స్‌లో పడేసే కొత్త హిట్టింగ్ ఈ సీజన్లో కనిపిస్తోంది. అదే రేంజ్ హిట్టింగ్. పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు చేయడానికి అదే కారణమవుతోంది. అసలు ఈ రేంజ్ హిట్టింగ్ అంటే ఏమిటంటే.. బ్యాట్స్‌మన్ తన పూర్తి సామర్థ్యాన్ని వాడుకుని, ఒక కొలమానం ప్రకారం తన శక్తితో బంతిని బౌండరీ బయటకు పంపించడమే. అంటే దృష్టిని పూర్తిగా బంతిపై నిలిపి.. తలను దానికి నేరుగా పెట్టి.. బంతిని సరిగా అంచనా వేసి.. ఫ్రంట్ ఫుట్‌ను ముందుకు పెట్టి.. బ్యాట్‌ను వెనక్కిలాగి.. వీలైనంత పైకి తీసుకెళ్లి.. ఒక్కసారిగా బలంగా బ్యాట్‌ను ముందుకు తెస్తూ బంతిని బాదడమే రేంజ్ హిట్టింగ్.
బేస్‌బాల్ టెక్నిక్‌తో
ఇలా కొట్టే షాట్లు స్టాండ్స్‌లో పడడం ఖాయం. చాలా మంది బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొట్టాలని ప్రయత్నించి భారీ షాట్లు ఆడి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ల చేతికి చిక్కుతుంటారు. వాళ్లు కొట్టిన బంతి ఆ బౌండరీ లైన్ దాటకపోవడానికి కారణం రేంజ్ హిట్టింగ్ లేకపోవడమే. బేస్‌బాల్ టెక్నిక్ కూడా రేంజ్ హిట్టింగ్‌ను సమర్థంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఈ టెక్నిక్‌తో కొట్టడం వల్ల తొడల బరువు నుంచి వచ్చే శక్తి కారణంగా బంతి ఫ్లాట్‌గా వెళ్లినప్పటికీ అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. ఈ తరహా షాట్లు ఆడటానికి బరువు ఉపయోగించుకోవడం, తలను బంతికి నేరుగా ఉండేట్లు పెట్టడం కీలకం.
రేంజ్ హిట్టింగ్‌కు డిమాండ్
ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌లోనే సీఎస్కేపై 32 బంతుల్లో 9 సిక్సర్లతో 74 పరుగులు చేసిన రాజస్థాన్ ఆటగాడు సంజూ శాంసన్ ఆ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. "ఈ తరం ఆటలో రేంజ్ హిట్టింగ్‌కు బాగా డిమాండ్ ఉంటోంది. ఈ లాక్డౌన్లో నేను దానిపైనే దృష్టిసారించా. ఆ సామర్థ్యాన్ని పెంచుకున్నట్లే అనిపిస్తోంది" అని చెప్పాడు. ఆ తర్వాత పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ అతను 7 సిక్సర్లు కొట్టడం విశేషం.