IND vs SA Test Squad: దక్షిణాఫ్రికాలో ఈ నెల 26న ఆరంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బుధవారం ప్రకటించనున్నారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. వరుస వైఫల్యాలతో కివీస్‌తో రెండో టెస్టుకు తుది జట్టులో చోటు కోల్పోయిన రహానే, ఫామ్‌లో లేని మరో సీనియర్ బ్యాట్స్‌మన్ పుజారాలపై వేటు వేయకపోవచ్చనే భావిస్తున్నారు. అయితే రహానేను వైస్‌కెప్టెన్‌గా తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. పేలవ ఫామ్‌లో ఉన్న సీనియర్ ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మను ఈ పర్యటనకు ఎంపిక చేయడం సందేహమే. సిరాజ్, ఉమేశ్ కొనసాగనుండగా.. బుమ్రా, షమీ తిరిగి జట్టులోకి రానున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్ లాంటి యువ పేసర్ల పేర్లను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు చోటు కోల్పోయిన విహారికి మళ్లీ అవకాశం దక్కొచ్చు.
పెద్దన్నలకు పరీక్ష
విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే.. దిగ్గజాల నిష్క్రమణ తర్వాత టెస్టుల్లో భారత జట్టుకు బ్యాటింగ్ మూల స్తంభాలుగా మారిన ముగ్గురు ఆటగాళ్లు. ఒకప్పటితో పోలిస్తే కోహ్లీ జోరు తగ్గిన మాట వాస్తవం. అతను సెంచరీ చేసి రెండేళ్లయింది. అలాగని విరాట్ పూర్తిగా బ్యాటింగ్ లయ కోల్పోలేదు. కోహ్లీ స్థాయి ఆటగాడిని తక్కువ అంచనా వేయలేం. పైగా అతను మూడు ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న క్రికెటర్. త్వరలోనే కోహ్లీ పూర్వపు ఫామ్‌ను అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ టెస్టుల్లో మాత్రమే ఆడే రహానే, పుజారా ఈ ఫార్మాట్లోనూ తమ స్థానాలను నిలబెట్టుకోవడం కష్టంగా మారిందిప్పుడు. జట్టుకు వరంలా ఉన్న ఆటగాళ్లు కొంత కాలంగా భారం అయిపోతున్నారు. మయాంక్, శ్రేయస్ లాంటి యువ ఆటగాళ్లు అదరగొడుతుంటే వీళ్లు తేలిపోతున్నారు. కుర్రాళ్లు మరిందరు టీమ్‌ఇండియా వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకుంటే జట్టులో చోటు గల్లంతవక తప్పదు.
'నయా వాల్'కు ఏమైంది?
Pujara Test Career: రాహుల్ ద్రవిడ్ ఖాళీ చేసిన మూడో స్థానంలో నిలకడగా ఆడుతూ టీమ్‌ఇండియా కొత్త 'గోడ' అనిపించుకున్న ఆటగాడు చెతేశ్వర్ పుజారా. మరీ ద్రవిడ్ స్థాయిలో కాకపోయినా.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ద్రవిడ్ లాగే గంటలు గంటలు క్రీజులో పాతుకుపోవడం, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం వల్ల మంచి గుర్తింపు సంపాదించిన ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ కొన్నేళ్ల నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అతను సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావస్తుండటం గమనార్హం. చివరగా 2019 జనవరిలో ఆస్ట్రేలియాలో 193 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగు టెస్టుల ఆ సిరీస్‌లో మరో శతకం సహా 500 పైచిలుకు పరుగులు చేసిన పుజారా.. ఆ తర్వాత ఈ స్థాయి ప్రదర్శన ఏ సిరీస్‌లోనూ చేయలేదు. అప్పుడప్పుడూ అర్ధశతకాలు సాధిస్తున్నా.. మూడంకెల స్కోరు మాత్రం అందుకోవడం లేదు. గతంలో ఎన్నోసార్లు జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆపద్బాంధవుడి పాత్ర పోషించిన పుజారా.. ఈ మధ్య ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. ఈ ఏడాది పుజారా 13 టెస్టుల్లో 29.82 సగటుతో 686 పరుగులే చేశాడు. 2016 సమయానికి పుజారా కెరీర్ సగటు 51 కాగా.. ఇప్పుడది 45 లోపు పడిపోవడం అతడి ఫామ్‌కు సూచిక. పుజారాతో పోలిస్తే రహానే ఫామ్ మరీ దారుణంగా ఉండటం వల్ల ముందు అతడిపై వేటు పడింది. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. పుజారాపై వేటు పడే రోజు కూడా ఎంతో దూరంలో లేకపోవచ్చు.
రహానే కాపాడుకోవాలి!
Rahane Test Career: ఒక టెస్టు మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడికి తర్వాతి మ్యాచ్‌కు తుది జట్టులో చోటే దక్కకపోవడం అరుదైన విషయం. అజింక్యా రహానే విషయంలో అదే జరిగింది. విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం వల్ల తొలి టెస్టుకు అతనే నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా ప్రతిభ చాటుకున్నా.. బ్యాటింగ్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులే చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఎంతో బాధ్యతాయుతంగా ఆడాల్సిన స్థితిలో 4 పరుగులకే వికెట్ ఇచ్చేశాడు. రెండో టెస్టుకు కోహ్లీ జట్టులోకి రావడం, తొలి టెస్టులో అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అద్భుత శతకం సాధించడం వల్ల.. రహానేపై వేటు తప్పలేదు. గాయం పేరు చెప్పి గౌరవంగా పక్కన పెట్టినా, అది వేటే అన్నది స్పష్టం. నిజానికి ఈ ఏడాది రహానె ఫామ్‌ను గమనిస్తే అతను ఇప్పటిదాకా తుది జట్టులో ఉండటమే గొప్ప. 22, 4, 37, 24, 1, 0, 67, 10, 7, 27, 49, 15, 5, 1, 61, 18, 10, 14, 0, 35, 4.. ఈ ఏడాది రహానే బ్యాటింగ్ చేసిన 21 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లివి. కేవలం రెండుసార్లు మాత్రమే అతను 50 స్కోరును దాటాడు. ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ వైఫల్యాల పరంపర చూస్తే రహానెపై ఎప్పుడో వేటు పడాల్సింది అనిపిస్తుంది. అయితే గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో ఘోర పరాభవం అనంతరం కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేస్తే.. సారథ్య బాధ్యతలు అందుకుని దాదాపు ద్వితీయ శ్రేణి అనదగ్గ జట్టును అతను గొప్పగా నడిపించి చరిత్రాత్మక సిరీస్ విజయాన్నందించాడు. రెండో టెస్టులో అతడి వీరోచిత శతకమే (112) సిరీస్‌ను మలుపు తిప్పింది. ఈ సిరీస్ ఘనతే రహానే ఇప్పటిదాకా జట్టులో కొనసాగడానికి కారణమైంది. కానీ ఎంతకూ అతను ఫామ్ అందుకోకపోవడం వల్ల ఇప్పుడు వేటు తప్పలేదు.