పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటు(inzamam ul haq heart attack)కు గురయ్యారంటూ సోమవారం వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇంజమామ్(inzamam ul haq news) ఖండించారు. తనకు ఎలాంటి గుండెపోటు రాలేదని తెలిపారు. కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో సమస్య బయటపడిందని చెప్పారు. దానికి చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో బుధవారం ఓ వీడియో విడుదల చేశారు.
"నాకు గుండెపోటు వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. కడుపులో ఇబ్బంది తలెత్తడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లా. అక్కడ నాకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎందుకైనా మంచిదని యాంజియోగ్రఫీ కూడా చేశారు. ఆ సమయంలో నా రక్త నాళాల్లో ఒకటి కొంత మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో స్టంట్ వేశారు. అది విజయవంతమైంది. 12 గంటల తర్వాత నేను ఇంటికి వెళ్లిపోయా. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా."
-ఇంజమామ్, పాక్ మాజీ క్రికెటర్
ఇంజమామ్ పాకిస్థాన్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సేవలందించారు. పాక్ తరఫున 120 టెస్టులు, 378 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 1992 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన పాక్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత కీలక ఆటగాడిగా మారి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. 2001 నుంచి 2007 వరకు పాక్ జట్టు సారథిగా ఉన్నారు.