వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో సంజూ శాంసన్ రాణిస్తే ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుందని అతడి కోచ్ బిజూ జార్జ్ సూచించారు. ఏడు నెలల కాలంలో జరిగే రెండు లీగుల్లో తన శిష్యుడైన శాంసన్ నిలకడగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎడమచేతి వాటం కావడం వల్లే సంజు కన్నా ఎక్కువగా రిషభ్ పంత్‌కు అవకాశాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే అది టీమ్‌ఇండియా యాజమాన్యం, వ్యూహాలు, జట్టు సమతూకాన్ని బట్టే ఉంటుందన్నారు.
"అవును, 2021 టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు సంజుకు ఇది సువర్ణావకాశం. తెలుపు బంతి క్రికెట్ కెరీర్‌ను పరిశీలిస్తే ఐపీఎల్‌లో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. లీగ్‌లో ఆడేందుకు వెళ్లినప్పుడు అతడిపై ఒత్తిడి ఉంటుందనుకోను. ఈ ఏడాది అతడింకా మరింత ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యాడు. అతడు అంతగా దృష్టి సారించడం మునుపెన్నడూ నేను చూడలేదు. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ త్రివేండ్రంలో అతడు సాధన చేశాడు."
-బిజూ జార్జ్, సంజూ శాంసన్ కోచ్
"ఐపీఎల్‌లో సంజూ శాంసన్ అద్భుతంగా ఆడతాడని టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని క్రికెటర్లందరికీ తెలుసు. లీగులో అతడు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌తో పోలిస్తే రిషభ్ పంత్‌ది ఎడమచేతి వాటం. అందుకే అతడికి ఎక్కువ అవకాశాలు రావొచ్చు. అయితే ఇప్పుడు కుడి, ఎడమ వాటం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు" అని బిజూ పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో 93 మ్యాచులు ఆడిన సంజు 27.61 సగటుతో 1696 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 102 నాటౌట్. రాజస్థాన్ రాయల్స్‌లో అతడికి ఎంతో ప్రాధాన్యం ఉంది.