ప్రస్తుతం జరుగుతోన్న భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో అజింక్యా రహానె(Ajinkya Rahane performance) పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో అతనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సెప్టెంబర్ 10 నుంచి జరగనున్న చివరి టెస్టులో రహానె(Rahane batting) ఆడతాడా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ (vikram rathore batting coach).. రహానెకు మద్దతుగా నిలిచాడు. ప్రసుత్తం రహానె బ్యాటింగ్‌లో రాణించలేకపోయినప్పటికీ.. జట్టులో కీలకంగా వ్యవహరిస్తాడని వ్యాఖ్యానించాడు.
"నేను ముందే చెప్పా. దీర్ఘకాలం క్రికెట్ ఆడే సమయంలో కొన్ని దశలుంటాయి. కొన్ని సందర్భాల్లో జట్టులో ఆటగాళ్లు విఫలమవ్వొచ్చు. అటువంటి సమయాల్లో వారికి అండగా ఉండాలి. పుజారా విషయంలోనూ ఇదే జరిగింది. ఆ తర్వాత అతనికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. దాంతో అతను పుంజుకుని.. ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు రహానె కూడా ఫామ్‌లోకి వస్తాడని నమ్మకం ఉంది. పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."
- విక్రమ్ రాఠోడ్, టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్
టీమ్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానె చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో రహానె ఇప్పటివరకు కేవలం 109 పరుగులే చేశాడు. దీంతో మెరుగైన ప్రదర్శన చేయని రహానెను ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారని క్రీడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రహానెకు మద్దతుగా నిలిచాడు రాఠోడ్.
ఇదీ చూడండి: ఈ ఐదు మార్పులతో టెస్టు క్రికెట్‌కు మరింత మజా!