టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదానాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనే తపనతో ముందుకెళ్తున్నాడు. గత సినిమా 'డియర్ కామ్రేడ్' బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా 'వరల్డ్ ఫేమస్ లవర్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇకపై ప్రేమ కథల జోలికి వెళ్లనని ప్రకటన చేసిన ఈ హీరో.. మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు.
![World Famous Lover is released on 14 Feb. The movie is directed by Kranthi Madhav and featured Vijay Deverakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6068410_vijay-3-2.jpg)
కథేంటంటే
గౌతమ్ అనే అనాథ (విజయ్ దేవరకొండ) ఎంబీఏ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు. అప్పుడే యామిని (రాశీఖన్నా) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. యామిని తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల సహజీవనం చేస్తుంటారు. ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తారు. గౌతమ్‌కు ఉద్యోగం చేయడం కంటే రచయితగా ఎదగాలని కోరిక ఉంటుంది. ఇందుకు ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతుంటాడు. ఇది యామినికి నచ్చదు. బ్రేక్ అప్ చెప్పి వెళ్లిపోతుంది. పిచ్చిగా ప్రేమించిన యామిని వెళ్లిపోవడంతో తట్టుకోలేని గౌతమ్.. తన జీవితంలో ఎదురైన సంఘటనలను తలచుకుంటూ వాటిని వాస్తవిక విషయాలను జోడిస్తూ 'వరల్డ్ ఫేమస్ లవర్' పేరుతో ఒక పుస్తకం రాస్తాడు. అయితే అది పూర్తవకుండానే ఓ సంఘటన వల్ల జైలు పాలవుతాడు. రెండేళ్లు జైలు జీవితం గడిపి వచ్చిన గౌతమ్ వరల్డ్ ఫేమస్ లవర్ పుస్తకానికి ఎలాంటి ముగింపునిచ్చాడు? గౌతమ్ జీవితంలోకి యామిని తిరిగి వచ్చిందా లేదా? ఇందులో సువర్ణ (ఐశ్వర్య రాజేశ్), ఇజా( ఇసాబెల్లా), స్మితా (కేథిరిన్)లతో సంబంధం ఏంటీ అనేది తెరపైనే చూడాలి.
![World Famous Lover is released on 14 Feb. The movie is directed by Kranthi Madhav and featured Vijay Deverakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6068410_wwds.jpg)
ఎలా ఉందంటే
ఇది ఓ నవలా చిత్రం వంటిది. అయితే ఇది ముందుగా రాసిన నవల కాదు. దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమా కోసం రాసుకున్నది. దర్శకుడు తన హావభావాలను హీరోతో పలికిస్తాడు. రచయిత అవ్వాలి అనుకున్న తన కలను తన ప్రేమ కథ రాసి నెరవేర్చుకుంటాడు హీరో. కథ ఇల్లెందు బొగ్గు గనుల్లో తేలగానే వేగం పుంజుకుంది. తెలంగాణ యాసలో శీనయ్యగా విజయ్, సువర్ణగా ఐశ్వర్య నటన, మాటలు ప్రధమార్థంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ద్వితీయార్థంలో గౌతమ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు విదేశాల్లో ఓ మంచి అవకాశం వస్తుంది. ఆ దేశం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ కథ రాస్తుంటాడు. యామిని-గౌతమ్‌ల మధ్య లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎంతుందో.. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ కూడా అదే స్థాయిలో కనిపిస్తుంటుంది. శీనయ్య-సువర్ణల ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. కేథరిన్, ఇజబెల్లాతో వచ్చే సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.
![World Famous Lover is released on 14 Feb. The movie is directed by Kranthi Madhav and featured Vijay Deverakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6068410_vijay-3-1.jpg)
ఎవరెలా చేశారంటే
విజయ్ ప్రేమ కథల జోలికి ఎందుకు వెళ్లనన్నాడో ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు అర్థమవుతుంది. రచయిత అవ్వాలని తపించే వ్యక్తిగా, భగ్నప్రేమికుడిగా, బొగ్గు గనిలో పనిచేసే కార్మికుడిగా, ఓ మధ్యతరగతి మహిళకు భర్తగా, ఈ విదేశీ అమ్మాయితో ప్రేమికుడిగా, ఎంబీఏ విద్యార్థిగా ఇలా.. విభిన్న పాత్రల్లో కనిపిస్తూ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనిపించుకోవడానికి విజయ్ ఎలా శ్రమించాడో తెరపై ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. మంచి నటీనటులుంటే ఓ సన్నివేశం ఎలా రక్తికట్టిస్తారో శీనయ్య-సువర్ణ పాత్రల్లో విజయ్-ఐశ్వర్యలను చూస్తే అర్థమవుతుంది. కేథరిన్ పాత్ర గ్లామర్‌కే పరిమితమైనా ఇసబెల్లా పైలెట్‌గా ఆకట్టుకుంది. రొమాన్స్ తోపాటు ఎమోషనల్ సీన్స్ లో రాశికన్నా విజయ్‌తో పోటీపడి నటించింది. ఇక దర్శకుడిగా క్రాంతిమాధవ్ సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. క్రియేటివ్ కమర్షియల్ నిర్మాణ విలువలు కథకు తగినట్లు సరిపోయాయి. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి.
![World Famous Lover is released on 14 Feb. The movie is directed by Kranthi Madhav and featured Vijay Deverakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6068410_vijay-3-4.jpg)
బలం
+ విజయ్, ఐశ్వర్య రాజేశ్, రాశీఖన్నా
బలహీనత
- కథనం, పతాక సన్నివేశాలు
చివరగా...
'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాగా కంటే నవలగా బాగుంటుంది.
గమనిక:
ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చదవండి: విజయ్ ఇకపై ప్రేమకథల్లో నటించడు!