ఎల్లలులేని కథానాయకుడు, కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న రజనీకాంత్ తొలి ప్రేమ విఫలమైందట. బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో రజనీ.. ఎంబీబీఎస్ చదువుతున్న నిర్మల ప్రేమించుకున్నారు. తన తొలి ప్రేమ గురించి తన స్నేహితుడు, మలయాళ నటుడు దేవన్‌కు ఓసారి చెప్పి, కన్నీరుపెట్టుకున్నారట.
"మేమంతా సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఉన్నాం. ఓ రోజు రజనీ నన్ను డిన్నర్‌కు ఆహ్వానించారు. ఆయన గదికి వెళ్లా. డిన్నర్‌కు కావాల్సినవన్నీ తెప్పించి పెట్టారు. ఆ సమయంలో రజనీ కాస్త మద్యం సేవించి.. 'నీకు తొలి ప్రేమ ఉందా?' అని అడిగారు. నేను నా లవ్‌స్టోరీ చెప్పా. ఆపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకు బాధపడుతున్నారని నేను అడిగా. ఆపై బెంగళూరులోని తన తొలిప్రేమ గురించి ఇలా చెప్పారు" అని దేవన్ తెలిపారు.
"అక్కడ కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న నిర్మలతో పరిచయం ఏర్పడింది. ఆమె బస్సు ఎక్కినప్పుడల్లా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం. ఓరోజు నేను ప్రధాన పాత్ర పోషించబోతున్న నాటకాన్ని చూసేందుకు నిర్మలను పిలిచా. ఆపై కొన్ని రోజులకు మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. అయితే నేను దరఖాస్తు చేసుకోకుండానే లెటర్ రావడం వల్ల షాకయ్యా. ఆపై దరఖాస్తు తనే చేశానని నిర్మల చెప్పింది. నాటకంలో నా నటన ఆమెకు బాగా నచ్చి, నా నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు నా తరఫున మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో అప్లికేషన్ వేసింది. నేను పెద్ద స్టార్ కావాలని ఆమె కోరుకున్నారు. అప్పట్లో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లేందుకు నా దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం తెలిసి నిర్మల రూ.500 ఇచ్చింది. ఆ డబ్బులతోనే చెన్నై వచ్చా. మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన తర్వాత ఓరోజు బెంగళూరుకు వెళ్లా. నిర్మల కనిపించలేదు. స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి చూశా. తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగును విచారించా. నిర్మల కుటుంబం మరో ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారని చెప్పారు" అని సూపర్‌స్టార్ తనతో పంచుకున్నారని దేవన్ వెల్లడించారు.
"అంతేకాదు ఆ తర్వాత ఇప్పటి వరకు తన జీవితంలో రజనీ.. నిర్మలను చూడలేదట. ఆ విషయం చెప్పి ఏడ్వడం మొదలుపెట్టారు. సాధారణంగా కాదు.. కన్నీరుమున్నీరయ్యారు. 'నేనెప్పుడు బెంగళూరుకు వెళ్లినా నిర్మల కనిపిస్తుందేమోనని చూస్తుంటా. కానీ ఇప్పటివరకు ఆమె నా కంటికి కనపడలేదు. ఆమె గొప్ప మహిళ. అందుకే ఎవర్నీ బాధపెట్టకూడదని ఇప్పటివరకు నన్ను చూసేందుకైనా రాలేదు. బహుశా తనను మర్చిపోయానని అనుకుందేమో' అని రజనీ తనతో అన్నారు" అని దేవన్ చెప్పారు. ఆపై ఏదో ఒకరోజు మీరు నిర్మలను కచ్చితంగా చూస్తారని నేను చెప్పడంతో ఆయన చాలా సంతోషపడ్డారని పేర్కొన్నారు.