తనదైన శైలిలో నటిస్తూ... కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగి గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు నాని. త్వరలో విభిన్న కథాంశంమైన 'టక్ జగదీష్' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా నేచురల్‌స్టార్ తన వ్యక్తిగత విశేషాలను పంచుకున్నాడు.
అదే పాటిస్తా
విజయం వస్తే ఆనందించడం, ఓటమి ఎదురైనప్పుడు బాధపడటంలో అర్థంలేదనుకుంటా. జీవితంలో రెండిటికీ సిద్ధపడాలనేది నా పాలసీ.
వెంటనే ఓకే చెప్పేస్తా!
చిన్నప్పటినుంచీ మణిరత్నం సినిమాలు చూస్తూ పెరిగిన నేను ఎలాగైనా సినిమాల్లోకి రావాలనుకున్నా. నా కల నెరవేరింది కానీ... ఆయన సినిమాలో నటించే అవకాశమే ఇంకా రాలేదు. ఆ రోజు త్వరలో రావాలని కోరుకుంటున్నా. అదే జరిగితే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంటా.
సత్యం థియేటర్ ఓ జ్ఞాపకం
అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌కు నాకూ విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం అక్కడ ఓ కొత్త సినిమా విడుదల అయ్యేది. గంటముందు టిక్కెట్లు ఇచ్చేవారు. ఆ లైన్లో నిల్చుని టిక్కెట్టు సాధించడం అంటే ఆ రోజుల్లో పెద్ద సవాలు. అలాగే కష్టపడి ప్రతి శుక్రవారం ఓ సినిమా చూసేవాడిని. కొన్నాళ్లకు నా సినిమాలూ ఆ థియేటర్‌లో ఆడాయి. అవి విడుదలైనప్పుడు సత్యం థియేటర్ దగ్గర కారును కాసేపు పార్క్‌చేసి... నా పోస్టర్ చూసుకుని పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తుచేసుకునేవాడిని.
గౌరీ టీచరు నాకెంతో స్పెషల్
నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేది కాదు. దాంతో ప్రతిటీచరూ నన్ను తిట్టేవారు. అయితే అయిదో తరగతిలో నాన్న నా స్కూలు మార్చారు. అక్కడ తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టాలి. నేనేమో ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడ్ని. ఇది తెలిసి తోటి పిల్లలు ఆటపట్టిస్తుంటే గౌరీ టీచర్ మాత్రం నన్ను ఒక్క మాట అనేవారు కాదు. పైగా అలా ఆటపట్టించే పిల్లల్ని తిడుతూనే.. నేను ఇంగ్లిష్ నేర్చుకునేలా ప్రోత్సహించారు. ఆవిడను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను.
ఆ నాలుగువేలు...
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు నేను తీసుకున్న జీతం నాలుగువేల రూపాయలు. ఇప్పుడు అంతకు ఎన్నో రెట్లు సంపాదిస్తున్నా సరే... ఆ నాలుగువేలను నా జేబులో పెట్టుకుని బండిమీద వెళ్తుంటే కలిగిన అనుభూతిని మాత్రం మర్చిపోలేను. ఏదో సాధించాననే భావన, సగం హైదరాబాదును కొనే యొచ్చన్నంత ధీమా. ఆ సంపాదన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
శనివారం కోసం చూసేవాడిని
ఒకప్పుడు శనివారం వస్తే ఓ పండగలా ఉండేది. ఎందుకంటే నేనూ, స్నేహితులతో కలిసి మాకు దగ్గర్లో ఉండే సోనీ దాభాలో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. దాంతో మళ్లీ శనివారం కోసం నేను సోమవారం నుంచి ఎదురుచూసేవాడిని. ఆ రోజులు మళ్లీ తిరిగిరావు.
ఇష్టమైన దర్శకులు
మణిరత్నం, రాజమౌళి, త్రివిక్రమ్
లాంగ్ బ్రేక్ దొరికితే..
వర్జీనియాలో ఉన్న మా అక్క దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తా.
నచ్చే సినిమా
చాలానే ఉన్నాయి కానీ.. మొదటిది అయితే 'దళపతి'. అందులో మణిరత్నం మ్యాజిక్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
జున్నూ ముందు నటించాలంటే..
నేను దాదాపు పదేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా ఏ రోజూ కెమెరా ముందు కంగారు పడలేదు. అయితే ఆ మధ్య 'దేవదాసు' షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ రోజు మా జున్నుగాడు నాతో కలిసి వచ్చాడు. ఆ రోజున వాడిని ఎదురుగా పెట్టుకుని నటించడానికి కాస్త కంగారుగా అనిపించింది.
అమ్మమ్మ చేతివంట సూపర్
మా అమ్మమ్మ వంట చాలా బాగా చేసేది. తను చేసిన చేపల పులుసు తలచుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది.
ఇదీ చూడండి: రాధేశ్యామ్లోని ఆ పాట కోసం 350మంది డ్యాన్సర్లు