చిన్ని 'ఈగ' విలన్‌ను ముప్పుతిప్పలు పెడుతుంటే చప్పట్లు కొట్టాం... 'ఈగ' బాధను, కోపాన్ని, ప్రేమను మన కళ్లకు కనిపించేట్లు చేసిందెవరు?
అవంతిక కోసం 'బాహుబలి' అలా కొండలు ఎక్కేస్తుంటే కళ్లప్పగించి చూస్తుండిపోయాం?... అంత అందంగా ఆ దృశ్యాలు ఎలా వచ్చాయి?
ఎన్టీఆర్‌ను కొమురం భీంగా, రామ్‌చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా మన కళ్లకు ప్రత్యక్షం చేయనున్న ఆ కెమెరా కళ్లు ఎవరివి?
ఇంకెవరి సెంథిల్‌కుమార్‌వే. తెలుగు సినిమా గర్వపడే చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించి... ప్రపంచ ప్రశంసలు అందుకున్న సెంథిల్‌కుమార్.. లాక్‌డౌన్ సమయంలో ఏం చేశారు? 'ఆర్‌ఆర్‌ఆర్' ఎక్కడ ఆగిపోయింది? ఎప్పుడు మొదలవుతుంది? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఇతర దేశాల్లో షూటింగ్స్ పరిస్థితి ఏమిటి?
కొన్ని దేశాల్లో సినిమా షూటింగ్స్ చేస్తున్నారు. అయితే పెద్ద ప్రాజెక్టులు ఇంకా మొదలుపెట్టలేదు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఏం చేయలేం. నాకు తెలిసి ఇప్పుడు పరిశ్రమలో వర్చువల్ టెక్నాలజీ పెరగబోతుంది.
వర్చువల్ టెక్నాలజీని 'ఆర్‌ఆర్‌ఆర్'’కు వాడే అవకాశం ఉందా?
బాహుబలి సమయంలో ప్రపంచ సినిమాలో ఏ టెక్నాలజీ ఉందో అదే వాడాం. కరోనా కాలంలో సినిమా టెక్నాలజీలో పెద్దగా మార్పులేవీ రాలేదు. వర్చువల్ ప్రొడక్షన్ గురించి తెలుసుకోడానికి చాలా సమయం కేటాయించా. ముందు మనం గ్రీన్ స్క్రీన్‌లో షూట్ చేసేవాళ్లం. ఇప్పుడు గ్రీన్‌స్క్రీన్ లేకుండా ఎల్‌ఈడీ ప్యానల్స్ పెట్టి షూట్ చేస్తున్నారు. స్టార్‌వార్స్‌లో ఆ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ టెక్నాలజీ 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రానికి ఉపయోగించాలా? వద్దా? అనేది మా టీం నిర్ణయం తీసుకుంటుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి.
'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టొచ్చు ?
మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్, మే, జూన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జులైలో విజృంభించింది. ఈ పరిస్థితుల్లో షూటింగ్ చేయలేకపోవచ్చు. మరో నెల, రెండు నెలలు పట్టే అవకాశాలు లేకపోలేదు. దేవుని దయతో కరోనా కష్టాలు తొందరగా తొలగిపోతే అభిమానులు ఆశిస్తున్న సమయానికి 'ఆర్‌ఆర్‌ఆర్'ను తీసుకొస్తాం.
బాలీవుడ్ అవకాశాలను వదులుకున్నారంట. ఎందుకు?
బాహుబలి విడుదలయ్యాక బాలీవుడ్ నుంచి అవకాశం వచ్చింది. ఒక మంచి సినిమాకు పని చేద్దామనే ఆలోచనలో ఉండేవాణ్ని. ఇంతలోనే రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' మొదలుపెట్టారు. ఆ సినిమా కాదని బాలీవుడ్‌కు వెళ్లలేకపోయా. దీనికి పనిచేయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది.
ఈ నాలుగు నెలలు కెమెరా ముట్టుకోకుండా ఎలా ఉండగలిగారు?
కరోనా వచ్చింది. ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకూడదంటే మొదట్లో బాగానే అనిపించింది. తర్వాత తెలియని బాధ కలుగుతోంది. నేను కెమెరాను, షూటింగ్స్‌ను చాలా మిస్సవుతున్నా. నాకు ఇష్టమైన పని చేయలేకపోతున్నాననే వేదన ఉంది. అయినా ఇలాంటి సమయంలో సామాజిక స్పృహతో వ్యవహరించడమే సరైనది అనిపిస్తుంది. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి.. వైరస్ వ్యాప్తికి మనం కారణం కాకూడదు కదా. అందుకే ఇంటికే పరిమితమయ్యా. ఇంట్లో వాళ్లతో ఇంత సమయం గడపడం ఇదే మొదటిసారి. భార్య పిల్లలతో గడిపే సమయం ఎక్కువగా రావడం అదృష్టంగా భావిస్తున్నా. రోజూ వర్కవుట్స్, యోగా, ధ్యానం చేస్తున్నా. పుస్తకాలు చదువుతున్నా. రకరకాల సినిమాలు చూస్తున్నా.