దేశ ఆర్థికావసరాలకు తగిన స్థాయిలో జనాభా స్థిరీకరణ సాధించాలంటూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1952లోనే కుటుంబ నియంత్రణకు శ్రీకారం చుట్టిన దేశం మనది. దరిమిలా మరణాల రేటు మందగించినా, జననాల ఉరవడి ఆగకపోవడంతో 1983 నాటి జాతీయ ఆరోగ్య విధానం 2000 సంవత్సరం నాటికల్లా సమతూక సంతానోత్పత్తి రేటు సాధనకు సంకల్పం ప్రకటించింది. ప్రపంచ విస్తీర్ణంలో కేవలం 2.4శాతం గల ఇండియా 16శాతం జనావళికి ఆవాసమై కొత్త సహస్రాబ్ది తొలినాళ్లకే వందకోట్ల జనసంఖ్య మైలురాయి దాటేసింది. వాజ్‌పేయీ జమానాలో వెలుగు చూసిన జాతీయ జనాభా విధానం అమలు, పర్యవేక్షణ, సమీక్ష బాధ్యతలతో జాతీయ జనాభా కమిషన్ అవతరించినా- మరికొన్నేళ్లలో జనసంఖ్య పరంగా చైనాను తలదన్నే దూకుడుతో ఇండియా పు'రోగ'మిస్తోంది.
సామాజిక జాడ్యాలపై దృష్టి సారిస్తేనే..
ఎన్నో విధాలుగా దేశ ప్రగతిని దిగలాగుతున్న జనాభా విస్ఫోటాన్ని నియంత్రించేందుకు చైనాలో మాదిరిగా జన నియంత్రణ చట్టం చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అర్జీదారు విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టులో తన మనోగతాన్ని నివేదించిన కేంద్రం- ఇరవయ్యేళ్ల నాడు 3.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2018 నాటికి 2.2కు దిగివచ్చిందని, దంపతులు సగటున ఇద్దరికి మించి పిల్లల్ని కోరుకోని వాతావరణంలో అది లక్షిత సంతానోత్పత్తి రేటు 1.8కి చేరుకొనే అవకాశం ఉందనీ వెల్లడించింది. 2001-11 మధ్య కాలంలో జనాభా వృద్ధిరేటు వందేళ్ల కాలంలో అతి తక్కువగా 17.6 శాతం నమోదైందన్న కేంద్ర సర్కారు- బలవంతపు కుటుంబ నియంత్రణ ప్రతికూల ప్రభావం చూపుతుందని తన ప్రమాణ పత్రంలో స్పష్టీకరించింది. జనాభా స్థిరీకరణ లక్ష్యాలకు తూట్లుపొడుస్తున్న సామాజిక జాడ్యాలపై లక్షిత దాడితోనే జన నియంత్రణ సాధ్యపడేది!
జననగణన అంచనాలివే..
మూడేళ్లనాటి జాతీయ ఆరోగ్య విధానం 2025కల్లా 2.1 సంతానోత్పత్తి రేటు సాధనకు సంకల్పించింది. ఇప్పటికే పాతిక దాకా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ లక్ష్యాన్ని అందుకొన్నాయన్న కేంద్రం- సంతానోత్పత్తి రేటు అధికంగా ఉన్న 146 జిల్లాల్లో 'మిషన్ పరివార్ వికాస్'ను పట్టాలకెక్కించింది. కుటుంబ నియంత్రణ సేవలు, సదుపాయాల్ని విరివిగా అందుబాటులోకి తెచ్చే ఈ పథకం సత్ఫలితాలనిస్తోందని కేంద్రం చెబుతున్నా- వచ్చే 16 ఏళ్లపాటు పదిశాతం వంతున పెరిగే జనాభా 2036కు 152 కోట్లు దాటనుందని సర్కారీ కమిటీయే నివేదిస్తోంది. 2036 నాటికి పనిచేసే వయసు (15-59 ఏళ్ల)లోని వారు దాదాపు 65 శాతంగా ఉంటారని; వృద్ధుల సంఖ్య 23 కోట్లకు, చదరపు కిలోమీటరు పరిధిలో జనసాంద్రత 368 నుంచి 463కు పెరుగుతుందని అధ్యయనాలు ఎలుగెత్తుతున్నాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ్‌బంగ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలే జనాభా వృద్ధి రేట్లకు నేడు రెక్కలు తొడుగుతున్నాయి.
ఆ కార్యాచరణే జన నియంత్రణకు మేలుబాటలు
మహిళల సామాజిక హోదా, విద్యార్హతలు, ఆరోగ్యాలపై వర్ధమాన దేశాలు దృష్టి సారించాలని 1994 నాటి కైరో సదస్సు దిశానిర్దేశం చేసింది. పట్టణాల్లో సంతానోత్పత్తి రేటు 1.8 ఉండగా, గ్రామీణ భారతంలో అది 2.4గా నమోదవుతోంది. చదువుకోని మహిళలే 3.4 రేటుతో సంతాన లక్ష్ములు అవుతున్నారని, ఇంటర్మీడియెట్ ఆపై చదువుకున్న వారు కుటుంబ నియంత్రణకు కట్టుబడి 1.7 రేటుతో ఆశారేఖలుగా మారుతున్నారని జాతీయ ఆరోగ్య సర్వే వెల్లడించింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల పట్ల జన జాగృతి కోసం స్వయంప్రతిపత్తితో అట్టహాసంగా 2003లో ఏర్పాటైన 'జనసంఖ్య స్థిరతా కోశ్' రెండేళ్ల క్రితం అస్తిత్వం కోల్పోయింది. ప్రాథమిక ఆరోగ్య సేవల విస్తరణతో పిల్లలు బాలారిష్టాలు అధిగమించి బతికి బట్టకడతారన్న నమ్మకాన్ని, అందుబాటులోని విద్యాబుద్ధులతో తమకు ఆలంబన కాగలుగుతుందన్న విశ్వాసాన్ని తల్లిదండ్రుల్లో నింపే కార్యాచరణే జన నియంత్రణకు మేలుబాటలు పరిచేది!
ఇదీ చదవండి: కర్షకుల ఆందోళనలో కదం తొక్కిన మహిళలు