గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటు డిమాండ్.. అల్లర్లు-సైనిక దళాల కాల్పులు.. తీవ్రవాద నాయకులతో కేంద్రప్రభుత్వం చర్చలు వంటి అంశాలతో ఎప్పుడూ పతాక శీర్షికలకెక్కే నాగాలాండ్‌లో ప్రస్తుతం ఎన్నికల వేడి అంతగా కనిపించడం లేదు! రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావం అంతంతమాత్రమే. ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. శాసనసభలోని 60 స్థానాల్లో ఒక స్థానం ఇప్పటికే ఏకగ్రీవమైంది. మిగిలిన 59 స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా మొత్తం స్థానాలకు అభ్యర్థులను నిలపలేని విచిత్రమైన స్థితి ఉంది.
ఎన్‌డీపీపీ-భాజపా: జట్టుగా బరిలోకి..
రాష్ట్రంలో ప్రస్తుతం సంకీర్ణ సర్కారును నడిపిస్తున్న నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ), భాజపా పొత్తుతో ఎన్నికల బరిలో దిగాయి. ఎన్‌డీపీపీ 40 స్థానాల్లో, భాజపా 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అకులుటో శాసనసభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఖేకషీ సుమి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో భాజపా అభ్యర్థి కజేటో కినిమి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. గ్రేటర్ నాగాలాండ్ సమస్యపై ఇప్పటివరకు స్పష్టత రాకపోవడం, ఆరు జిల్లాల్లో(వీటిలో 20 అసెంబ్లీ స్థానాలున్నాయి) ఏడు గిరిజన తెగలపై గట్టి పట్టున్న ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీవో) వైఖరి అంతుపట్టకపోవడం అన్ని పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. ఈఎన్‌పీవో తొలుత ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. కేంద్రప్రభుత్వం చూపిన చొరవతో ఆ పిలుపును ఉపసంహరించుకుంది.
జనాభాపరంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నా.. వారికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఇప్పటికీ సరైన వసతులు లేనందున ప్రత్యేక స్వయంప్రతిపత్తి మండలి ఏర్పాటుచేయాలని ఈఎన్‌పీవో డిమాండ్ చేస్తోంది. గ్రేటర్ నాగాలాండ్ కోసం డిమాండ్ చేస్తున్న పలు తీవ్రవాద సంస్థలతో చర్చలు జరిపి, కాల్పులు విరమణ అమలయ్యేలా చూస్తున్న కేంద్రప్రభుత్వానికి ఇది తలనొప్పిగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ప్రత్యేక’ హామీ ఇచ్చిన తర్వాతే తాము ఎన్నికల బహిష్కరణ పిలుపును ఉపసంహరించుకున్నామని ఈఎన్‌పీవో నాయకులు చేస్తున్న ప్రకటనలు స్థానికంగా అధికార ఎన్‌డీపీపీ-భాజపా కూటమి నేతలను ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
- కలిసొస్తాయని భావిస్తున్న అంశాలు
- ముఖ్యమంత్రి నిఫుయో రియో సమర్థత
- రాష్ట్రంలో ఇతర పార్టీలు బలంగా లేకపోవడం
- చిన్నాచితకా పార్టీల మద్దతు
ఎన్‌పీఎఫ్: కింగ్‌మేకర్ అవుతామన్న ఆశ
గత ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) 26 స్థానాలు గెల్చుకోవడం ద్వారా రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడం, జాతీయ పార్టీలకు అవకాశం లేకుండా చేయడం కోసమంటూ.. ఎన్‌పీఎఫ్ నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది ఎన్‌డీపీపీలో చేరిపోయారు. ఒకరు భాజపా గూటికి వెళ్లారు. ఫలితంగా ఎన్‌పీఎఫ్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మిగిలారు. ప్రస్తుతం ఆ పార్టీ సగం స్థానాల్లోనూ అభ్యర్థులను నిలపలేకపోయింది. 22 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదు. తాము కింగ్‌మేకర్‌గా అవతరిస్తామన్న ఆశ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.
- కలిసొస్తాయని భావిస్తున్న అంశాలు
- ఎన్‌డీపీపీ-భాజపా ప్రభుత్వంపై వ్యతిరేకత
- క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పట్టు
కాంగ్రెస్: ఈసారైనా సీట్లు దక్కేనా..
కాంగ్రెస్ ఈ దఫా 23 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. చర్చి వర్గాల నుంచి వ్యక్తమవుతున్న సానుకూలతపైనే అది ఆధారపడి ఉంది. రాష్ట్ర జనాభాలో 88 శాతం క్రైస్తవులు. ముస్లింల వాటా 2.5 శాతం. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కూడా చేయలేదు.
- కలిసొస్తాయని భావిస్తున్న అంశాలు
- ఎన్‌డీపీపీ-భాజపా సర్కారుపై వ్యతిరేకత
- క్రైస్తవ, ముస్లిం వర్గాల ఓటుబ్యాంకు
- తీవ్రవాదాన్ని రూపుమాపడంలో గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ చేస్తున్న ప్రచారం
2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) 2 స్థానాలు గెల్చుకుంది. జేడీయూ ఒక నియోజకవర్గంలో జయభేరి మోగించింది. ప్రస్తుతం ఎన్‌పీపీ 12 చోట్ల, జేడీయూ 7 స్థానాల్లో బరిలో దిగాయి. వీటితో పాటు ఎల్జేపీ(రాంవిలాస్) 15, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 12, ఆర్‌పీఐ(అఠావలె) 9, ఆర్జేడీ 3 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. సీపీఐ, రైజింగ్ పీపుల్స్ పార్టీ ఒక్కో స్థానంలో బరిలో నిలిచాయి. 19 మంది స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నాడు నేడు ఒకేలా..
నాగాలాండ్‌లో 2018లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాదీ అదే తేదీన పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఒక స్థానం ఏకగ్రీవమవడంతో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడూ అచ్చం అదే పరిస్థితి.