శరీరం నిరంతరం కేలరీలను వినియోగించుకుంటూనే ఉంటుంది. పనులేవీ చేయని సమయాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఇలా విశ్రాంతి తీసుకునే సమయంలోనూ కేలరీలు ఖర్చు కావటమనేది కండరాలు బలంగా ఉన్నవారిలో ఎక్కువ. అరకిలో కండరం తనకోసమే రోజుకు సుమారు 6 కేలరీలను వినియోగించుకుంటుంది. అదే అరకిలో కొవ్వు రోజుకు 2 కేలరీలనే ఖర్చు చేస్తుంది. ‘ఆ.. ఆరు కేలరీలేనా?’ అని చిన్నచూపు చూడొద్దు. రోజులు గడుస్తున్నకొద్దీ వీటిని లెక్కేస్తే పెద్ద మొత్తమే అవుతుంది. కాబట్టి కండరాలను వృద్ధి చేసే వ్యాయామాలపై దృష్టి సారించండి. వీటితో శరీరంలోని అన్ని కండరాలు ప్రేరేపితమవుతాయి. రోజువారీ సగటు జీవక్రియల వేగమూ పెరుగుతుంది.
ఏరోబిక్ వ్యాయామాలు
శరీరానికి మరింత ఎక్కువగా ఆక్సిజన్ అందేలా చేసే నడక, పరుగు, ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు కండరాలను వృద్ధి చేయకపోవచ్చు. కానీ వ్యాయామాల అనంతరం జీవక్రియలు పుంజుకునేలా చూస్తాయి. వీటిని ఎంత వేగంగా, ఎంత ఎక్కువ సమయం చేస్తే అంత ప్రయోజనం. అంటే ఒక మాదిరి వేగంతో పరుగెత్తేవారు మధ్య మధ్యలో కాస్త వేగంగా పరుగెత్తితే ఇంకాస్త ఎక్కువ ఫలితం కనిపిస్తుందన్నమాట.
తగినంత నీరు
శరీరం కేలరీలను వినియోగించుకోవటానికి నీరు అత్యవసరం. ఒంట్లో నీటిశాతం కొద్దిగా తగ్గినా జీవక్రియల వేగం మందగిస్తుంది. రోజుకు 4 గ్లాసుల నీరు తాగేవారితో పోలిస్తే 8 గ్లాసుల నీరు తాగేవారిలో మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి తగినంత నీరు తాగేలా చూసుకోవాలి. దాహం వేసినంతవరకు ఆగాల్సిన పనిలేదు. మధ్యమధ్యలో గొంతు తడుపుకోవచ్చు. చిప్స్ వంటి చిరుతిళ్లకు బదులు తాజా పండ్లు, కూరగాయలు తిన్నా మంచిదే. వీటితోనూ సహజ సిద్ధంగా నీరు లభిస్తుంది.
శక్తి పానీయాలతో జాగ్రత్త
కొందరు జీవక్రియలను పెంచుకోవటానికి తక్షణ శక్తినిచ్చే పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్) తాగుతుంటారు. వీటిల్లో కెఫీన్ దండిగా ఉంటుంది. ఇది శరీరం వెంటనే శక్తిని వినియోగించుకునేలా చేస్తుంది. కొన్ని పానీయాల్లో టారిన్ అనే అమైనో ఆమ్లమూ ఉంటుంది. ఇదీ జీవక్రియలు పుంజుకోవటానికి, కొవ్వు ఖర్చు కావటానికి తోడ్పడుతుంది. అయితే శక్తి పానీయాలతో చిక్కేంటంటే- అధిక రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీయటం. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడ్రియాట్రిక్స్ అయితే వీటిని పిల్లలకు, యుక్తవయసువారికి ఇవ్వద్దనే చెబుతోంది.
తక్కువ తక్కువగా తిండి
తక్కువగా ఎక్కువ సార్లు తినటం బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. ఒకేసారి పెద్దమొత్తంలో ఆహారం తినేవారు భోజనానికి భోజనానికి మధ్య చాలా సమయం తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో జీవక్రియలు మందగిస్తాయి. అందువల్ల ప్రతి 3-4 గంటలకు ఓసారి కొద్దిగా ఆహారం లేదా చిరుతిండి తింటే జీవక్రియలు సజావుగా సాగుతాయి. రోజంతా మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయి. మధ్యమధ్యలో చిరుతిండి తినేవారు భోజనం వేళ తక్కువగా తింటున్నట్టూ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
కాస్త కారం ఘాటు
మిరపకాయలు, మిరియాల వంటి వాటిల్లోని సహజ రసాయనాలు జీవక్రియల వేగం పెరిగేలా చేస్తాయి. కాబట్టి వంటకాలకు కాస్త పచ్చి మిరప, కారం పొడి వంటివి జోడించండి. మసాలా దినుసుల ప్రభావం తాత్కాలికమే కావొచ్చు గానీ వీటిని తరచూ తింటుంటే ప్రయోజనాలూ తోడవుతూ వస్తుంటాయి.
ప్రొటీన్ మేలు
కొవ్వు, పిండి పదార్థాలతో పోలిస్తే ప్రొటీన్‌ను జీర్ణం చేసుకునే సమయంలో శరీరం మరిన్ని ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. కాబట్టి ఆహారంలో పిండి పదార్థాలను ఒకింత తగ్గించి చికెన్, చేపలు, పప్పు గింజలు (నట్స్), చిక్కుళ్లు, గుడ్లు, వెన్న తీసిన పాల పదార్థాల వంటివి చేర్చుకోండి. ఇవి ఒకవైపు శరీరానికి శక్తినిస్తూనే మరోవైపు కేలరీలు ఎక్కువ ఖర్చయ్యేలా చేస్తాయి.
ఇదీ చూడండి: చిన్న మార్పులతోనే మేలైన ఆరోగ్యం!