రాజధాని నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా సూరారం కట్టమైసమ్మ గుడి మలుపు వద్ద అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులకు సంబంధించిన ఓ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు కిలోకి పైగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
అతివేగం.. అనర్థకరం
యువకులు నిజామాబాద్‌కి చెందిన అనంత్ విశాల్, మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన సాయి సుజిత్‌గా గుర్తించారు. దుండిగల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం విశాల్ పుట్టిన రోజు సందర్భంగా... అతడి తండ్రి ద్విచక్రవాహనం కొన్నారు. వాహనంపై అతి వేగంతోపాటు హెల్మెట్ లేకపోవటం వల్ల ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో వాహన వేగం 90కి పైగా ఉన్నట్లు దుండిగల్ సీఐ వెంకటేశం వివరించారు.
అవగాహన కార్యక్రమాలు
ఇక యువకుల వద్ద లభించిన గంజాయి పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి చరవాణులు స్వాధీనం చేసుకుని... కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న వారిని పట్టుకుంటామని... విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతామని దుండిగల్ సీఐ వెంకటేశం తెలిపారు.
కన్నీటి సంద్రం
మరికొన్ని రోజుల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరుతారని కలలు కంటున్న తల్లిదండ్రులు... యువకుల మృతితో శోకసంధ్రంలో మునిగారు.