శనివారం అధికార వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా మిలిటరీ పరేడ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కిమ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో దేశాన్ని మార్గనిర్దేశం చేయడంలో తాను విఫలమయ్యానంటూ కిమ్ కన్నీరు పెట్టుకున్నారు.
ఈ దేశ ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంచారు. కానీ నేను వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అందుకు నన్ను క్షమించండి. గ్రేట్ కామ్రేడ్స్ కిమ్-ఇల్-సంగ్, కిమ్-జోంగ్-ఇల్ నుంచి ఈ దేశాన్ని నడిపించే బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మా ప్రయత్నాలు, చిత్తశుద్ధి ప్రజల జీవితంలోని కష్టాలను తొలగించడానికి సరిపోలేదు
- కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత
ఇప్పటికీ ప్రజలకు తన మీదున్న నమ్మకం పోలేదని, దేశ శ్రేయస్సు కోసం తాను ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా దానికి తన ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కిమ్. ఈ సందర్భంగా దేశ సైనిక బలగాలకు కిమ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కరోనా వైరస్ సంక్షోభంతో తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటోన్న ప్రపంచ దేశాల ప్రజలకు తన మద్దతును ప్రకటించడంతో పాటు, రాబోయే రోజుల్లో దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాను బహిరంగంగా విమర్శించకపోయినా.. బెదిరింపులకు దిగితే సహించేది లేదంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు.
మహమ్మారి కారణంగా ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదైనట్లు ప్రకటించని ఉత్తర కొరియా.. సరిహద్దు వద్ద మాత్రం కఠిన నిబంధనలు అమలు చేస్తూ, షూట్-టు-కిల్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, జూన్‌లో మొదటి వైరస్ అనుమానిత కేసును గుర్తించినట్లు ప్రకటించి, కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్ విధించడం గమనార్హం.
ఇదే కారణం..!
అయితే కిమ్ కన్నీరుకు కారణం ఆయన పాలనపై పెరిగిన ఒత్తిడికి నిదర్శనమంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. "ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకు కంటనీరు పెట్టుకున్నారో గమనించాలి. ఆయన తన నాయకత్వంపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థమవుతోంది" అంటూ కొరియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ యూనిఫికేషన్‌లోని ఉత్తర కొరియా విభాగం డైరెక్టర్ హాంగ్ మిన్ అభిప్రాయడ్డారు.