ఎవరెస్ట్ శిఖరం పునస్సమీక్షించిన ఎత్తును నేపాల్-చైనా ఉమ్మడిగా ప్రకటించనున్నాయి. ఈ మేరకు డ్రాగన్ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేపాల్ పర్యటనలో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ శిఖరం నేపాల్, చైనా దేశాల సరిహద్దుల్లో ఉంది. ఎవరెస్ట్‌ను నేపాల్‌లో సాగర్మాత, చైనాలో జుములంగ్మా పేరుతో పిలుస్తారు.
"ఎవరెస్ట్ శిఖరం నేపాల్, చైనాల మైత్రి బంధానికి చిహ్నం. వాతావరణ మార్పు, పర్యావరణ రక్షణ వంటి రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మెరుగుపరుస్తాం. సాగర్మాత, జుములంగ్మా ఎత్తుపై ఉమ్మడి ప్రకటన చేస్తాం."
-నేపాల్ పర్యటన సందర్భంగా జిన్‌పింగ్.
ఇప్పటికే ఎవరెస్ట్ శిఖర ఎత్తును సమీక్షించేందుకు ఓ బృందాన్ని పంపింది నేపాల్. హిమాలయ పర్వత శిఖరాల్లో ఉన్న ఎవరెస్ట్ ఎత్తు క్షీణించిందన్న వార్తలను కొట్టి పారేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ నేపథ్యం...
ఎవరెస్ట్ ఎత్తును ప్రప్రథమంగా భారత సర్వే విభాగం 1954లో కొలిచి.. 8848 మీటర్లుగా తేల్చింది. అనంతర కాలంలో పలు సర్వే బృందాలు కొలిచినప్పటికీ 1954 నాటి గణాంకాలనే ప్రామాణికంగా భావిస్తున్నారు. కానీ 2015 నాటి భూకంపం కారణంగా ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2017లో ఓ ప్రత్యేక బృందాన్ని ఎవరెస్ట్ ఎత్తు కొలిచేందుకు ఏర్పాటు చేసింది నేపాల్. 2020 చివర్లో నూతన ఎత్తుపై ప్రకటన వెలువడనుంది.
ఇదీ చూడండి: ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...!