కరోనా టీకా పంపిణీలో ప్రపంచదేశాల మధ్య అసమానతలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పది దేశాలకే 75శాతం డోసులు అందాయని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఇది 'క్రూరమైన అసమానత, అన్యాయం'గా అభివర్ణించారు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు వీలైనంత త్వరగా టీకా అందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఐరాస భద్రతా మండలి అత్యున్నత సమావేశానికి హాజరైన ఆయన.. 130 దేశాలకు కొవిడ్ టీకా ఒక్క డోసు కూడా అందలేదని తెలిపారు. వ్యాక్సిన్ సమానత్వమే ప్రపంచం ముందు ప్రస్తుతమున్న అతిపెద్ద నైతిక సవాలని అన్నారు.
ఏకతాటిపైకి తేవాలి
టీకా పంపిణీ కోసం 'గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్లాన్'ను రూపొందించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు గుటెరస్. శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో పాటు.. పంపిణీకి నిధులు సమకూర్చేవారిని ఏకతాటిపైకి తీసుకురావాలని అన్నారు. ఇందుకోసం జీ20 దేశాలు ఎమర్జెన్సీ టాస్క్ఫోర్స్ను నెలకొల్పాలని సూచించారు.
దాడులపై ఫైర్!
నైజీరియాలో ఓ ప్రభుత్వ పాఠశాలపై దాడి చేసి విద్యార్థులను అపహరించిన ఘటనను గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ ఖండించారు. పాఠశాలలు, విద్యా సంస్థలపై దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇందుకు బాధ్యులైనవారిని విడిచిపెట్టొద్దని నైజీరియా అధికారులకు విజ్ఞప్తి చేశారు.
నైజీరియా కగారాలోని ప్రభుత్వ సైన్స్ కళాశాలపై బుధవారం ఉదయం కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మరణించగా... 42 మంది అపహరణకు గురయ్యారు. ఇందులో 27 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది, 12 మంది సిబ్బంది కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇదీ చదవండి: ఏడాది తర్వాత కనిపించిన కిమ్ భార్య