కరోనా వైరస్ మనుషుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పాయి. జన్యుమార్పిడితో కూడా కరోనా వైరస్ సంభవించలేదని స్పష్టం చేశాయి. అయితే వైరస్ పుట్టుకపై పరిశోధనలు జరుపుతున్నట్టు పేర్కొన్నాయి. వైరస్‌తో చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు సంబంధం ఉందా? లేక జంతువుల నుంచి వచ్చిందా అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నట్టు తెలిపాయి. ఈ మేరకు జాతీయ నిఘా వ్యవస్థ డైరక్టర్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
"విస్తృత శాస్త్రీయ పరిశోధనల అనంతరం కరోనా వైరస్‌ను మనుషులు రూపొందించలేరని, జన్యు మార్పిడితో సంభవించలేదని నిఘా సంఘాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే అప్పటికే వైరస్ సోకిన జంతువుల నుంచి మనిషికి వ్యాపించిందా? లేదా వుహాన్ ల్యాబొరేటరీలో జరిగిన ఓ ప్రమాదంలో ఇది సంభవించిందా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం నిఘా సంఘాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి."
--- అమెరికా జాతీయ నిఘా సంస్థ ప్రకటన.
ట్రంప్ వాదన వేరే..
వుహాన్‌లోని ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న తరుణంలో నిఘా వ్యవస్థలు ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైరస్‌పై అనేక విషయాలను చైనా దాటిపెట్టిందని ఆరోపించారు ట్రంప్.
ట్రంప్, ఆయన సహచరులు ఎన్ని ఆరోపణలు చేసినా.. ఓ గబ్బిలం నుంచే వైరస్ వ్యాపించిందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
ట్రంప్ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, రాజకీయ లబ్ధిపొందడం కోసం ట్రంప్ ఈ ఆరోపణలు చేస్తున్నట్టు మండిపడుతూనే ఉంది.