Shahrukh Khan Airport: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌ను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షారుక్ శుక్రవారం రాత్రి షార్జా నుంచి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే?
యూఏఈలోని ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ సినిమా ఐకాన్, కల్చరల్ నరేటివ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి శనివారం షారుక్ ఖాన్ వెళ్లారు. షారుక్ శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. షారుక్ ఖాన్, ఆయన బృందాన్ని టీ-3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు.
షారుక్ ఖాన్ బ్యాగును సిబ్బంది తనిఖీ చేశారు. బ్యాగులో Baubn & Zurbk వాచీలు, 6 బాక్సుల రోలెక్స్ వాచీలు, స్పిరిట్ బ్రాండ్ వాచీలు, యాపిల్ సిరీస్ వాచీలు లభించాయి. వీటితో పాటు వాచీల ఖాళీ పెట్టెలు కూడా ఉన్నాయి. అయితే విమానాశ్రయంలో దాదాపు గంటపాటు తనిఖీల తర్వాత షారుక్, ఆయన మేనేజర్ పూజా దద్లానీని కస్టమ్స్ అధికారులు విడిచిపెట్టారు.
కానీ షారుక్ బాడీగార్డ్ రవితోపాటు మిగిలిన టీమ్‌ను అడ్డుకున్నారు. షారుక్ బాడీగార్డ్ రవి కస్టమ్ డ్యూటీ రూ.6.87 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఉదయం 8 గంటలకు ప్రక్రియ పూర్తయిన తర్వాత బాడీగార్డ్ రవిని పంపించేశారు. జరిమానా మొత్తాన్ని షారుక్ క్రెడిట్ కార్డు నుంచే చెల్లించినట్లు ఎయిర్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది.