Kalyan Ram Bimbisara: విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆఖరి రక్తపుబొట్టు వరకూ కష్టపడి పని చేస్తానని నటుడు కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన 'బింబిసార' ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారందరికీ థ్యాంక్యూ చెబుతూ చిత్రబృందం ఓ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా కల్యాణ్‌రామ్ తమ చిత్రానికి అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
''2020 మార్చి 10న 'బింబిసార' మొదలుపెట్టాం. సినిమా ప్రారంభించిన ఐదో రోజే లాక్‌డౌన్ అన్నారు. మూడున్నర నెలల తర్వాత షూట్ తిరిగి ప్రారంభించాం. సెకండ్‌వేవ్.. మళ్లీ లాక్‌డౌన్ అన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుపడ్డాను. ఏదో ఒక రకంగా షూట్ పూర్తి చేసి సినిమా విడుదల చేద్దాం అనుకునే సమయానికి ప్రేక్షకులు అస్సలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నా. పైకి కంగారుగా అనిపించినప్పటికీ.. మంచి కంటెంట్‌తో సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మా. అదే ఇప్పుడు రుజువైంది. మా సినిమాకు మంచి విజయాన్ని అందించిన నందమూరి వీరాభిమానులు, సినీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారు. చోటా కె.నాయుడు నన్ను ఎంతో భరించి వర్క్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఎంతోమంది నటీనటుల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఆ క్షణం మళ్లీ పుట్టాననిపించింది. నాకు పునర్జన్మనిచ్చిన చిత్రం 'బింబిసార'. ఇక, నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించేందుకు ఆఖరి రక్తపుబొట్టు వరకూ కష్టపడి వర్క్ చేస్తా.'' అని కల్యాణ్ రామ్ అన్నారు.
అనంతరం 'బింబిసార' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజు మాట్లాడుతూ.. ''జూన్ 3న తెలుగు చిత్రపరిశ్రమలో రెండు సినిమాలు విడుదలై సూపర్‌హిట్స్ అందుకున్నాయి. అవే 'విక్రమ్', 'మేజర్'. ఆ తర్వాత సుమారు రెండు నెలలు ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పరిశ్రమ ఏమైపోతుంది? ఏం చేయాలి? ఎలా ప్రేక్షకుల్లోకి వెళ్లాలి? అని భవిష్యత్తుపై అందరూ ఆందోళన చెందుతున్న వేళ 'సీతారామం', 'బింబిసార' విడుదలై మాలో ఊపిరి నింపాయి. సినిమా అంటేనే ఒక కుటుంబం. ఏ సినిమా ఆడినా అందరం సంతోషిస్తాం. వశిష్ఠ 'దిల్' సమయం నుంచి తెలుసు. అతడికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. చేజారిపోయాయి. కానీ కుంగిపోలేదు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తన సత్తా చాటుకున్నాడు. ఇండస్ట్రీకి సూపర్‌హిట్ ఇచ్చాడు. విడుదలకు 15 రోజుల ముందే ఈ సినిమా చూశా. కల్యాణ్ రామ్ నటన బాగా నచ్చేసింది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనిపించింది. సినిమా రిలీజ్ అయ్యాక చోటాకు ఫోన్ చేస్తే ఏడ్చేశాడు. ఏమైంది ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావ్ అని అడగ్గా.. ''పదేళ్లైంది నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చి. నీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా'' అన్నాడు'' అని దిల్ రాజు చెప్పగానే స్టేజ్‌పై ఉన్న చోటా కె.నాయుడు మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దిల్‌రాజు స్పష్టం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి: 'బింబిసార' చిన్నారి గురించి ఈ విషయాలు తెలుసా?
ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఘనత.. వీరి చిత్రాలతోనే ఆ స్టార్ డైరెక్టర్ల కెరీర్ షురూ!