ఆదివారం పలువురికి ప్రాణాంతకంగా మారింది. సరదాగా గడపాల్సిన సెలవు రోజున.. రోడ్లపై రక్తం చిందుతోంది. ఆ రోజే ఎక్కువ మంది దుర్మరణం చెందుతున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు రోడ్డు ప్రమాదాల్లో 473 మంది మరణించారు. ఇందులో ఆదివారం రోజుల్లోనే 87 మంది చనిపోయినట్లు లెక్క తేల్చారు.
ఆ తర్వాత మంగళవారం...
సైబరాబాద్ పరిధిలో ఏడు నెలల్లో 2,505 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 442 ప్రమాదాల్లో 473 మంది దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఆదివారం.. ఆ తర్వాత మంగళవారం ఎక్కువ మంది దుర్మరణం చెందుతున్నట్లు గుర్తించారు.
రహదారులు ఖాళీగా ఉండటంతో...
ఆదివారం సెలవు దినం కావడంతో ట్రాఫిక్ రద్దీ అంతగా ఉండదు. ఇంకేముంది.. ఖాళీ రోడ్లను చూసి వాహనదారులు గాల్లో దూసుకెళ్తుంటారు. ఏదైనా అడ్డొస్తే ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు గుర్తించారు. పార్టీలు.. దావత్‌లు ఆరోజే ఎక్కువగా జరుగుతుంటాయి. ఆరోజు ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ఉండరనే భావనతో ఇష్టారీతిగా వాహనాలను మద్యం మత్తులో నడపడం కూడా కారణమని తేల్చారు.
ఆ 3 గంటలు చాలా ప్రమాదం...
రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సమయంలో తొందరగా ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో హడావుడిగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు వివరిస్తున్నారు. ముందు వెళ్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా కారణమని పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి: ACCIDENTS: రక్తసిక్తమవుతున్న రహదారులు.. రోజుకు 34 రోడ్డు ప్రమాదాలు
ఇదీ చూడండి: pocharam srinivas reddy: 'రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమానికి పునరంకితం అవుదాం'