Casino Issue in Hyderabad: రాష్ట్రంలో కలకలం రేపుతున్న క్యాసినో వ్యవహారంపై ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేపాల్‌లో జూన్ 10 నుంచి 13 వరకు నాలుగు రోజులపాటు క్యాసినో వేగస్ బై బిగ్‌డాడీ పేరిట... పెద్దఎత్తున గ్యాంబ్లింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంబ్లింగ్‌లో నగదు ఎలాచేతులు మారిందన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్యాసినో ఆడించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పంటర్లను హైదరాబాద్ నుంచి బంగాల్‌కు.. ప్రత్యేక విమానంలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ వ్యవహారానికి... ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించారు. విమానాలు సమకూర్చే బంజారాహిల్స్‌కు చెందిన ఏజెంట్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఈ వ్యవహారంలో కోట్లలో నగదును విదేశీ మారకంగా మార్చిన అంశంపైన అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. నగదును.. నేపాల్ రూపీల్లోకి ఎలా మార్చారు..? పంటర్లు గెల్చుకున్న రూపీలను తిరిగి రూపాయల్లోకి ఎలా మార్చారు..? అనే వివరాలను ఈడీ అధికారులు రాబట్టనున్నారు. ఇప్పటివరకు ప్రవీణ్ ఎన్ని క్యాంపులు నిర్వహించారు..? పంటర్లను తరలించినందుకు చేసిన వ్యయం ఎంత..? విదేశాల్లోకి నగదు లావాదేవీలను హవాలా మార్గంలో ఎలా జరిపాడనే విషయాలు తేల్చేపనిలో ఈడీ నిమగ్నమైంది. తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రవీణ్‌కు గల సన్నిహిత సంబంధాలపైనా.. ఆరా తీస్తున్నారు. ఇందుకోసం వారి వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు.
క్యాసినో నిర్వహణకు సంబంధించి.. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారాలను పరిశీలిస్తున్న అధికారులు.. హాజరైన ప్రముఖులు, లావాదేవీలపై ఆరాతీస్తున్నారు. ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీతారలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫెమా కేసులో ప్రవీణ్, మాధవరెడ్డిని సోమవారం ప్రశ్నించనున్న ఈడీ... నిందితుల సమాధానాల మేరకు మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశముంది.
ఇవీ చూడండి: