ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్న ఆమె ఆశలు సమాధయ్యాయి. పెళ్లి పారాణి ఆరకముందే.. ఆమె విగతజీవిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుతోనే ఆ తండ్రీ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా పాత మద్ధిపడగలో చోటుచేసుకుంది.
అంతసేపు ఆనందంలో మునిగితేలిన ఆ కుటుంబాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పెళ్లి భాజాలతో మార్మోగిన ఆ లోగిలి కన్నీటి సంద్రమైంది. కొత్త జీవితాన్ని ప్రారంభించకుండానే.. ఆ దంపతులను విధి విడదీసేసింది. పెళ్లి ముచ్చటైన తీరకుండానే ఆ తీపి క్షణాలను చెరిపేసింది.
ఘనంగా కూతురు పెళ్లి జరిపించి.. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టిన ఆనందం ఆ తండ్రిది. కుటుంబాన్ని విడిచి వెళ్తున్నా.. వేల కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాననే సంతోషం ఆ కూతురిది. వీరిద్దరి ఆనందాన్ని చూసిన ఆ దేవుడికి కన్నుకుట్టిందో ఏమో... పెళ్లి జరిగి మూడురోజులైనా గడవకముందే... ఆ తండ్రీకూతురినిద్దరినీ కానరాని లోకాలకు తీసుకెళ్లాడు.
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్ధిపడగ గ్రామానికి చెందిన మౌనికకు మహారాష్ట్రలోని బల్లార్ష మండలం రాజురాకు చెందిన యువకుడితో ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం పెళ్లికొడుకు ఇంటివద్ద విందు భోజనం ముగించుకున్నారు. అందరితో సంబరంగా గడిపిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కడం మండలం పాండ్వాపూర్ వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా బ్రిడ్జికి ఢీకొట్టి బోల్తా పడింది. ఘటనలో పెళ్లికూతురు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మృతిచెందారు. పెళ్లి కొడుకుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా జరిగిన ప్రమాదం పెళ్లింట్లో తీరని విషాదం నింపింది.
ఇదీ చూడండి: బైక్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం