రాష్ట్రంలోని గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం అందిస్తున్నామని, వారి ఆరోగ్యానికి ఇంకా విలువైన పోషకాహారం అందించేందుకు ఓ కమిటీ వేసి ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్(Minister Satyavathi Rathod) అన్నారు. కరోనా సమయంలో గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు రావడానికి భయపడటం వల్ల వారికి పోషకాహారం అందాలనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి ఆలోచన మేరకు అంగన్వాడీ వర్కర్లను గౌరవించే విధంగా అంగన్వాడీ టీచర్లుగా పిలుచుకుంటున్నామని మంత్రి సత్యవతి(Minister Satyavathi Rathod) తెలిపారు. కొవిడ్ సమయంలో అంగన్వాడీ టీచర్లు చేసిన సేవలను గుర్తించి రాష్ట్రానికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందని చెప్పారు. అంగన్వాడీ టీచర్ల జీతం, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, ఖాళీల భర్తీలపై అసెంబ్లీలో పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యవతి రాఠోడ్ సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల జీతం రూ.10వేల 500 ఉందని, ఇందులో కేంద్రం వాటా.. 2,700 రూపాయలు కాగా.. రాష్ట్రం వాటా 7,800 రూపాయలని మంత్రి సత్యవతి(Minister Satyavathi Rathod) వెల్లడించారు. పీఆర్సీ అమలైతే వారికి 13వేల 500 రూపాయలు వస్తుందని చెప్పారు. అంగన్వాడీ ఆయాలకు 6వేల రూపాయల జీతం ఇస్తుండగా.. అందులో కేంద్రం ఇచ్చేది రూ.1350 అని, రాష్ట్రం వాటా రూ.4650 అని తెలిపారు. పీఆర్సీ వస్తే వారికి రూ.1800 అదనంగా వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అంగన్వాడీల నియామకాలు కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగుతున్నాయని.. ప్రస్తుతం కొన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి(Minister Satyavathi Rathod) వెల్లడించారు. మిగతా ఖాళీలను వేరే పద్ధతిలో భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇటీవలే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు.. తెలంగాణలో గర్భిణీలు, బాలింతలు, పిల్లల పోషణ చాలా బాగుందని.. ఇక్కడ పిల్లలకు ఇచ్చే బాలామృతం ఇతర రాష్ట్రాల్లో అందజేయాలనుకుంటున్నట్లు చెప్పారని వెల్లడించారు.
తెలంగాణలో అంగన్వాడీ సెంటర్లకు ఇప్పటికే 11వేల 181 సొంత భవనాలుండగా.. 12వేల 400 అద్దె భవనాలు ఉన్నాయి. వీటిలో 11వేల 970 సెంటర్లు.. కమ్యూనిటీ హాల్స్, పాఠశాలల్లో నడుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా భయం వల్ల ఇలా జరుగుతోంది. వారి కోసం.. ప్రీ స్కూల్ కిట్లను ఇళ్లకు పంపిస్తున్నాం. అంగన్వాడీ ఉద్యోగుల వేతనం ఆలస్యం కాకుండా ప్రతినెల మొదటి వారంలోనే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
- సత్యవతి రాఠోడ్, రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి