కరోనా రెండో వేవ్ ఉధృతి కొనసాగుతుండడం, లాక్‌డౌన్ అమలుతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రభుత్వ శాఖల పరంగా చేసే ఖర్చులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొవిడ్ చికిత్స, అందుకయ్యే ఔషధాలు, మౌలికసదుపాయాలను సమకూర్చుకునేందుకు భారీ వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా రోగులకు చికిత్స, నియంత్రణకు మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరొకటి లేదని... ఇందుకోసం ఎంత వ్యయమైనా ఖర్చు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే అప్పు తీసుకొచ్చైనా నిధులు సమకూరుస్తామని అన్నారు. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమయ్యే ఔషధాలను సమకూర్చుకోవాలని, మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకానికి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ కోసం కేటాయింపులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లాక్‌డౌన్ ప్రభావం..
లాక్‌డౌన్ అమలుతో హోంశాఖ వ్యయం కూడా పెరగనుంది. ఇక మిగతా శాఖల్లో కార్యాకలాపాలు లేకుండా పోయాయి. విద్యాసంస్థలు, వసతి గృహాలన్నీ మూతపడ్డాయి. వివిధ ఇతర కార్యక్రమాలను చేపట్టే అవకాశం లేదు. ఆర్థికంగా లబ్ది చేకూర్చే పథకాలు, కార్యక్రమాలు, రాయతీలను చేపట్టే అవకాశం లేదు. దీంతో ఆయా శాఖల వ్యయం తగ్గనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని శాఖల ఖర్చు పెరుగుతుందని, మరికొన్ని శాఖల ఖర్చు తగ్గుతుందన్న సీఎం కేసీఆర్... అందుకు అనుగుణంగా బడ్జెట్ లో మార్పులు, చేర్పులు చేయాలని తెలిపారు. వ్యయం అధికంగా అయ్యే వైద్య-ఆరోగ్య, హోంశాఖలకు బడ్జెట్ పెంచాలని తెలిపారు. ఈ విషయమై కసరత్తు చేయాలని ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావును ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులపై హరీష్ రావు కసరత్తు ప్రారంభించారు. సీఎంఓ ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుతో మంత్రి ఈ విషయమై మంగళవారం సుధీర్ఘంగా చర్చించారు. ఆర్థిక వనరులు, ఆయా శాఖల వారీగా అవసరాలపై చర్చించారు. కొవిడ్ చికిత్స, నివారణ చర్యల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంచిన మొత్తం, భవిష్యత్ అవసరాలపై సమీక్షించారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమయ్యే నిధుల సమీకరణపై చర్చించారు.
కేటాయింపుల్లో మార్పులు..
టీకాలకు 1260 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. అందులో ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలను విడుదల చేశారు. 18 కోట్ల వ్యయంతో నాలుగు లక్షల డోసులను కొనుగోలు చేశారు. టీకాల లభ్యతను బట్టి మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. మరికొంత కసరత్తు చేశాక కొంత మేర స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చూడండి: kcr: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్