2లక్షల 30వేల 825.96 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపుదిద్దుకుంది. లక్షా 69 వేల 383.44కోట్లు రెవెన్యూ వ్యయంగా లెక్కతేల్చారు. 45,509.6 కోట్లు ఆర్థిక లోటుగా అంచనా వేశారు. 29 వేల 46.77 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించారు. 6వేల743.50 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఏడాది 47వేల 5 వందల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించామని హరీశ్‌రావు వెల్లడించారు. పన్నుల ఆదాయంగా 92వేల 910 కోట్లు వస్తుందని అంచనా వేశామని తెలిపారు. పన్నేతర ఆదాయంగా 30వేల 557.35 కోట్లు, గ్రాంట్ల అంచనాగా 38వేల 669.46కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 13వేల 990.13 కోట్లు వస్తుందని అంచనా వేశామన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 12వేల 5 వందల కోట్లు, ఎక్సైజ్ ఆదాయం 17 వేల కోట్లు, అమ్మకం పన్ను ఆదాయం 26వేల 500 కోట్లు, వాహనాల పన్ను 5 వేల కోట్లు వస్తుందని అంచనా వేశామని ఆర్థిక మంత్రి సభకు వివరించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు పెద్దపీట
శాఖల వారిగా కేటాయింపులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. 29వేల 271 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వార్షిక పద్దులో 800 కోట్లు లెక్కచూపించారు. ఈసారి దళితుల కోసం 'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్' ప్రత్యేక పథకం ప్రకటించిన ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించారు. కరోనా వేళ అన్ని రంగాలు కుదేలయ్యాయని వెల్లడించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ప్రతికూలతలు అధిగమించి నిలదొక్కుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముందు వరుసలో ఉండే వ్యవసాయ రంగానికి కేటాయింపులు కొనసాగిస్తున్నామని ప్రకటించారు. వ్యవసాయ శాఖకు 25 వేల కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ యాంత్రీకరణకు 15 వందల కోట్లు, రైతు బంధుకు 14వేల 8 వందల కోట్లు.. రుణమాఫీకి 5వేల 225 కోట్లు, పశుసంవర్ధకశాఖకు 17వందల 30కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. నీటిపారుదలశాఖ పద్దు 16వేల 931 కోట్లు, సమగ్ర భూసర్వేకు 400 కోట్లు కేటాయించారు.
సంక్షేమానికి కేటాయింపులు
బడ్జెట్‌లో సంక్షేమానికి కేటాయింపులు కొనసాగించారు. ఆసరా పింఛన్లకు 11వేల728 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు 2వేల 750 కోట్లు, ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధికి 21వేల 306.85 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి 12వేల 304.23 కోట్లు, ఎస్టీ గృహాలకు విద్యుత్ రాయితీకి 18 కోట్లు, 3 లక్షల గొర్రెల యూనిట్లకు 3 వేల కోట్లు, బీసీలకు కల్యాణలక్ష్మికి అదనంగా 5 వందల కోట్లు, నేతన్నల సంక్షేమానికి 338 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు, బీసీ సంక్షేమశాఖకు 5వేల 522 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 16 వందల 6 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. సొంత స్థలం కలిగిన పేదలకు 2 పడక గదుల ఇళ్ల హామీ అమలుకు త్వరలో విధి విధానాలు ప్రకటిస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రెండు పడక గదుల ఇళ్లకు 11 వేల కోట్లు కేటాయించారు. పురపాలకశాఖకు 15 వేల 30 కోట్లు కేటాయించిన విత్తమంత్రి.. పట్టణాల్లో సమీకృత మార్కెట్లకు 5 వందల కోట్లు, పట్టణాల్లో వైకుంఠధామాలకు 200 కోట్లుగా నిర్ణయించారు.
తాగునీటికి ప్రాధాన్యం
హైదరాబాద్ తాగునీటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. నాగార్జునసాగర్ సమీపంలో సుంకిశాల నుంచి హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు కేటాయించారు. మూసీ పునరుజ్జీవానికి 200 కోట్లు, మెట్రో రైలుకు వెయ్యి కోట్లు, ఓఆర్ఆర్ లోపల కొత్త కాలనీల్లో తాగునీటి వసతికి 250 కోట్లు, వరంగల్ కార్పొరేషన్‌కు 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు 150 కోట్లు కేటాయించారు. వైద్యారోగ్యశాఖ పద్దుగా 6 వేల 295 కోట్లుగా నిర్ణయించారు. విద్యారంగ అభివృద్ధికి రెండేళ్లలో 4 వేల కోట్లతో నూతన విద్యా పథకం అమలు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున మౌలిక వసతుల సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బృహత్తర విద్యా పథకం కోసం ఈ ఏడాది 2 వేల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు 11వేల 735 కోట్లు, ఉన్నత విద్యకు 18 వందల 73 కోట్లుగా నిర్ణయించారు.
విద్యుత్ శాఖకు 11 వేల 46 కోట్లు
హోంశాఖ పద్దును 6వేల465 కోట్లుగా నిర్ధారించిన ఆర్థిక మంత్రి.. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, పోలీసు కార్యాలయాలకు 725 కోట్లు కేటాయించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి 610 కోట్లు లెక్కచూపారు. పౌరసరఫరాల శాఖకు 2వేల 363 కోట్లు, సాంస్కృతిక, పర్యాటక రంగాలకు 726 కోట్లుగా లెక్కచూపారు. కీలకమైన విద్యుత్‌శాఖకు 11 వేల46 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమలశాఖకు 3వేల 77 కోట్లుగా నిర్ణయించగా.. రాయితీలకు 2వేల 5 వందల కోట్లుగా నిర్ణయించారు. ఐటీ రంగానికి 360 కోట్లు.. ఈ ఏడాది ఆర్టీసీకి 3 వేల కోట్లు కేటాయించారు. ఆర్టీసీకి బడ్జెట్ ద్వారా 15 వందల కోట్లు, బడ్జేటేతర రూపంలో మరో 15 వందల కోట్లు ప్రతిపాదించారు. ఆర్ అండ్ బీకి 8వేల788 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ 750 కోట్లుగా లెక్కచూపింది. ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులకు 800 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతుకు 300 కోట్లుగా నిర్ణయించారు. ఆర్వోబీలు, ఆర్యూబీలకు 400 కోట్లు, ద్వితీయశ్రేణి నగరాల్లో ఎయిర్‌స్ట్రిప్‌ల అభివృద్ధికి 100 కోట్లను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయింపులు జరిపింది.
బడ్జెట్ వివరాలు..
- 2021-22 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు
- రూ.2,30,825.96 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
- రెవెన్యూ వ్యయం - రూ.1,69,383.44 కోట్లు
- ఆర్థిక లోటు అంచనా - రూ.45,509.60 కోట్లు
- పెట్టుబడి వ్యయం - రూ.29,046.77 కోట్లు
- రెవెన్యూ మిగులు - రూ.6,743.50 కోట్లు
- ఈ ఏడాది రూ.47,500 కోట్ల రుణాలకు ప్రతిపాదన
- పన్నుల ఆదాయం అంచనా - రూ.92,910 కోట్లు
- పన్నేతర ఆదాయం - రూ.30,557.35 కోట్లు
- గ్రాంట్ల అంచనా - రూ.38,669.46 కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా - రూ.13,990.13 కోట్లు
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా - రూ.12,500 కోట్లు
- ఎక్సైజ్ ఆదాయం అంచనా - రూ.17 వేల కోట్లు
- అమ్మకం పన్ను ఆదాయం అంచనా - రూ.26,500 కోట్లు
- వాహనాల పన్ను - రూ.5 వేల కోట్లు
ఇదీ చదవండి: 2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్