Gorantla fire on YSRCP: ఏపీ సీఎం జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయని.. తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ తప్పుడు విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని స్పష్టం చేశారు. ఇంతటి అసమర్థమైన, అవినీతిపరుడైన సీఎం దేశంలో ఎక్కడా లేరని ధ్వజమెత్తారు.
'2020 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. కానీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది వైకాపా ప్రభుత్వం. వారికి దోచుకోవటం.. దాచుకోవటం తప్ప ఏమీ తెలియదు. జగన్ తప్పుడు విధానాల వల్ల పోలవరానికి ఈ దుస్థితి. సొంతవారికి కట్టబెట్టి దోపిడీకి తెరతీశారు. దీనికి ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు.'- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా సీనియర్ నేత
సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని.. రంకెలేస్తే పోలవరం పూర్తికాదనే విషయాన్ని అంబటి రాంబాబు గ్రహించాలని హితవు పలికారు. వాస్తవాలు బయటపడకుండా పోలవరం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారని.. చేతకానితనంతో రాయలసీమను ఎండగడతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆక్షేపించారు.
ఇదీ చదవండి: 'పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం'