కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగకుండా ఇతర పక్షాలతో కలిసి నడిచిన తెలుగుదేశం తెలంగాణ శాఖ తాజాగా తన విధానాన్ని మార్చుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో నేరుగా బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యనేతల్లో ఒకరిని నిలబెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ స్థానంలో తెదేపాకు మద్దతిచ్చే వారి నుంచి వివరాల సేకరణ ప్రారంభించింది.
అందుకోసం ఆన్‌లైన్ లింకును అందరికీ పార్టీ నేతలు పంపుతున్నారు. దీనిద్వారా పార్టీకి ఎంత మంది మద్దతిస్తున్నారనే విషయం తెలుస్తుందని.. వచ్చే నెల మొదటి వారానికల్లా ఓ అంచనాకు రావచ్చని పార్టీ భావిస్తోంది. దాని ప్రకారం అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలో పార్టీ నిర్ణయిస్తుంది.
విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తెరాస ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, దీని ఆధారంగా తెదేపా నెగ్గుతుందని భావిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. ఇకనుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి పార్టీ సత్తా చూపిస్తామన్నారు.
ఇదీ చూడండి : ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి