Musical Instrument Veena Makers : మనసును మైమరిపింపజేసే సప్తస్వరాలను తనలో నింపుకున్న ఆ వీణ స్వరం ప్రస్తుతం మూగబోతోంది. తరతరాలుగా దీనిని తయారు చేయడమే కులవృత్తిగా జీవనం సాగిస్తున్న కళాకారులు పూటగడవని దీనస్థితికి చేరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వీరి గురించి పుస్తకాల్లో చదవడం తప్ప ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడు.. మామిడి పండ్లతో పాటు వీణల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారు చేసే వీణలకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉండేది. రాజులకాలం నుంచి కళాకారులు వీటిని తయారుచేస్తున్నారు. ఇప్పటికీ ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. వీణ తయారీలో ప్రావీణ్యం సాధించిన కొందరికి అత్యున్నత పురస్కారాలు కూడా లభించాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. తరతరాలుగా వీణ తయారీ కులవృత్తిగా ఉన్న కళాకారులకు బతుకు భారంగా మారింది. కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆసక్తి చూపడం లేదు
వీణ తయారీ చాలా నిష్టతో కూడిన పని. ఈ పనిని నేర్చుకోవడానికి ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. భవిష్యత్తులో ఈ కళ అంతరించి పోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే చాలామంది వీణ తయారీ వృత్తిని వదిలిపెట్టేశారు. తమ పిల్లలకు కూడా కళాకారులు ఈ కళను నేర్పించడం లేదు. వారసత్వంగా వస్తున్న కులవృత్తిపై మమకారం చంపుకోలేక కొందరు ఇంకా కొనసాగుతున్నారు. నమ్ముకున్న వృత్తి ఇప్పుడు తమకు అన్నం పెట్టలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'నేను పదేళ్ల వయసులో వీణ తయారీని నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు నాకు 60ఏళ్లు. అప్పట్లో దీనిపై చాలామంది ఆసక్తి చూపేవారు. ఇప్పుడు వీణాలను తయారు చేసే వారిని వేళ్లపై లెక్కించే పరిస్థితి వచ్చింది. ఇది చాలా నిష్టతో కూడిన పని. ఈ పనిని నేర్చుకోవడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. భవిష్యత్తులో ఈ కళ అంతరించి పోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. తరువాతి తరాలు దీనిని మ్యూజియంలో చూసే పరిస్థితి వస్తుందేమో. ఒక వీణ తయారు చెయ్యడానికి 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. దీనికి సంబంధించిన అన్ని చేతితోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి మిషిన్లు లేవు. దీనికి చాలా నైపుణ్యం అవసరం' - రమేష్, వీణు తయారుచేసే కళాకారుడు
'నేను మా నాన్న నుంచి ఈ కలను నేర్చుకున్నాను. ఇప్పటి వరకు అనేక రకాల వీణలను తయారు చేశాను. ఎంతో మంది సంగీత విద్వాంసులకు వీణలను అందజేశాను. ప్రముఖుల నుంచి పురస్కారాలు, బహుమతులు తీసుకున్నాను. ఇంతకు ముందు చాలా మంది ఈ వృత్తిలో కొనసాగేవారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేకపోవడంతో వేరే వృత్తులపై ఆధారపడుతున్నారు. ఆదాయం లేకపోయినా తరతరాలుగా వస్తున్న ఈ కళపై మమకారంతో ఇందులోనే జీవనం సాగిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కళ అంతరించి పోకుండా సాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్ తరాలకు ఈ కళను అందించాలని ఆశపడుతున్నాను.' - షేక్ మాబు, కళాకారుడు
చేయూత కోసం
ఆదాయం లేకపోయినా తరతరాలుగా వస్తున్న కళపై మమకారంతో ఇందులోనే జీవనం సాగిస్తున్న యువ కళాకారులు చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. చేతి వృత్తులకు సాయం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం... తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ప్రాచీన కళకు జీవం పోయాలని.... నూజివీడు వీణ తయారీ కళాకారులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Telangana High Court On Omicron : 'పండుగలొస్తున్నాయ్.. ఆంక్షలు విధించండి'