ఏపీలో రెవెన్యూ శాఖ అవివీతిమయమంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు మనస్థాపానికి గురి చేశాయంటూ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఖర్చులకు నిధులు విడుదల చేయకున్నా.. చిత్తశుద్ధితో పని చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. రేయింబవళ్లు కష్టపడి నీతి, నిజాయతీగా పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ధర్మానకు రెవెన్యూ శాఖలోని కష్టాలు తెలిసి ఇలా మాట్లాడటం బాధాకరమన్నారు. కొవిడ్ కాలంలో ప్రతి స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందించారని గుర్తు చేసారు. క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రీ-సర్వేను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీ సర్వే విజయవంతంగా పూర్తి చేయుటకు సరిపడా నిధుల్లేవని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల తక్షణమే కావాల్సిన కనీస సౌకర్యాలు, నిధుల విడుదల లేవని అన్నారు.
"వీఐపీల ప్రోటోకాల్ కోసం కనీసం నిధులు, కోర్టు కేసుల పరిష్కారానికి అయ్యే ఖర్చులకు నిధులివ్వటం లేదు. తహసీల్దార్ల వాహనాలకు అద్దె చెల్లించేందుకు తగిన నిధులు, కార్యాలయాల రోజువారీ ఖర్చులకు సరిపడా నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. 2019లో సాధారణ ఎన్నికలకు సంబంధించి పెట్టిన ఖర్చులో కొంత మేర ఇప్పటికీ తహసీల్దార్లకు ప్రభుత్వం చెల్లించలేదు. కొవిడ్ కాలంలో ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నేటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి చెల్లింపులు కాలేదు. అవినీతికి పాల్పడే అధికారులను.. ఉద్యోగులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమర్దించదు. నిధుల లేమి, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లభ్యత లేకున్నా.. ప్రభుత్వ పథకాల అమలుకు పని చేస్తున్నాం. రెవెన్యూ శాఖకు సంబంధంలేని అనేక పనులు కూడా జిల్లా అధికారుల ఆదేశాలకు లోబడి పని చేస్తున్నాం. ప్రతి వ్యవస్థలో ఒకటి రెండు శాతం వక్రబుద్ది ఉన్నవాళ్లు ఉంటారు. అటువంటి వారిని మా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ దరిచేరనివ్వదు ప్రోత్సహించదు. నిజాయతీతో నిబద్ధతతో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులను నిరుత్సాహపర్చొద్దు." -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్
ఇదీ చదవండి: కేసీఆర్ మాటలు నమ్మిన రైతులు నిండా మునిగారు: రేవంత్‌రెడ్డి