Telangana Liberation Day: సెప్టెంబర్‌ను 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని తెరాస సర్కార్‌ను డిమాండ్ చేస్తున్న భాజపా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహణకు సిద్ధమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల తరహాలోనే ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సాంస్కృతిక శాఖ అధికారులతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిజాం పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల' పేరుతో వీటిని జరపనున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్‌శిందే, పలువురు కేంద్ర మంత్రులు కూడా రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సాయుధ బలగాల కవాతు మధ్య అధికారికంగా వేడుకలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కారణంగానే తెలంగాణకు విముక్తి లభించిందనే విషయాన్ని అమిత్‌షా ప్రధానంగా సభలో ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఈనెల 15 లోపు పూర్తి చేయనున్నారు. ఈ నెల 17న అన్నిచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
ఏడాది పాటు వేడుకలు జరపనుండటంతో.. నవంబర్‌లో యువ సమ్మేళనాలు, డిసెంబర్‌లో జన జాగరణకు ఏర్పాట్లు చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 15 వరకు ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. నిజాం అకృత్యాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, సమ్మేళనాలను నిర్వహించాలని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తాము అధికారంలోకి వస్తే.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న భాజపా ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇలా..: మరోవైపు తెలంగాణ విలీన దినోత్సవాలను అధికారికంగా మూడు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. ఆ సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతో కూడిన హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉంది. 1948 సెప్టెంబరు 17న భారత్‌లో విలీనమైంది. తెరాస ఆవిర్భావం తర్వాత 2001 నుంచి ఏటా తెలంగాణ భవన్‌లో విలీన దినోత్సవాలను పార్టీ నిర్వహిస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెరాస తరఫునే ఉత్సవాలు జరుగుతున్నాయి. అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నెల 17 నాటికి హైదరాబాద్ రాష్ట్రం విలీనమై 74 ఏళ్లు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా విలీన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశంపై కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చిస్తున్నారని తెలిసింది. ఈ నెల 17 నుంచి విలీన దినోత్సవాలను జరిపి, 75వ సంవత్సరానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలా అన్న విషయంపై ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి: