Employee unions On PRC: ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ను కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు..ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని అన్నారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్‌మెంట్‌లపై వివరించారని తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సీఎం జగన్‌ను కోరామన్నారు.
"ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆర్థికశాఖ కార్యదర్శి వివరించారు. ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్‌మెంట్‌లపై వివరించారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని సీఎంను కోరాం. 2010లో వేతన సవరణ సంఘం వేతనాలపై అధ్యయనం చేసింది. 27 శాతం సిఫార్సు చేస్తే అప్పటి ప్రభుత్వం 39 శాతం ఇచ్చినట్లు చెప్పారు. 2010లోనే 39 శాతం వేతనాల పెరుగుదల శాస్త్రీయమన్నారు. 2022లో ఎంత శాతం వేతనాలు పెంచాలో ఆలోచించాలని కోరాం. పింఛనర్లకు ఉన్న రాయితీని తగ్గించే ప్రతిపాదనలు అంగీకరించవద్దని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించలేదు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది జీతభత్యాలు పెరగలేదు. సిబ్బంది జీతభత్యాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరాం. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది జీతభత్యాలు పెరగాల్సి ఉంది. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని కోరాం. గత ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. రాష్ట్ర ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరాం."
- ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి: జగన్
CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని.. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని.. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని చెప్పారు.
"ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నా. అన్ని సమస్యలూ సరిదిద్దేందుకు చర్యలు చేపడతాం. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నా. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నా. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తా. మంచి చేయాలన్న తపనతో ఉన్నాం."
- ఏపీ సీఎం జగన్
ఇదీ చదవండి: రామకృష్ణ విడుదల చేసిన వీడియో తీవ్ర క్షోభకు గురిచేసింది: వనమా