రాష్ట్రంలో వచ్చే జూన్ నుంచి ప్రారంభం కానున్న వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసింది. గతేడాది సాగైన 1.34 కోట్ల ఎకరాలతో పోలిస్తే ఈ ఏడాది 28 లక్షల ఎకరాలు అదనంగా పెంచాలనేది లక్ష్యం. మొత్తం 1.62 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసినట్లు ప్రభుత్వానికి తెలిపింది.
* పత్తి, కంది, నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం బాగా పెంచాలనేది వ్యవసాయ శాఖ లక్ష్యం. పత్తి పంటను గతేడాది 60 లక్షల ఎకరాల్లో వేయగా ఈ సీజన్‌లో 80 లక్షలకు చేరుతుందని అంచనా. వచ్చేనెల రెండో వారం నుంచి బీటి విత్తనాల విక్రయాలు ప్రారంభించాలని అన్ని కంపెనీలకు వ్యవసాయశాఖ సూచించింది. 1.75 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీలు వివరించాయి.
* వరి సాగు విస్తీర్ణం సాధ్యమైనంత వరకూ తగ్గించాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు సూచించింది. గతేడాది వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరి వేయగా ఈ సీజన్‌లో కనీసం 5 లక్షల ఎకరాలైనా తగ్గేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది.
* కంది సాగు విస్తీర్ణం అదనంగా 150 శాతం పెంచి 25 లక్షల ఎకరాల్లో వేసేలా చూడాలి. సంకరజాతి విత్తనాలు సరఫరా చేయాలని జాతీయ, రాష్ట్ర విత్తన సంస్థలతో చర్చించింది.
* గతేడాది 2.25 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా.. ఈసారి 2.29 లక్షల ఎకరాలకు మించకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* మొత్తం 1.62 కోట్ల ఎకరాల లక్ష్యంలో పత్తి 80, వరి 48, కంది 25 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.