IT company car gifts: చెన్నైకి చెందిన ఓ ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్‌లు ఇచ్చింది. కంపెనీ వృద్ధి మెరుగ్గా నమోదైన నేపథ్యంలో.. ఇందుకు కారణమైన ఉద్యోగులను ఆనందంలో ముంచెత్తింది 'ఐడియాస్2ఐటీ' అనే సంస్థ. పదేళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులకు ఒక్కో మారుతీ సుజుకీ నెక్సా కారును ఉచితంగా అందించింది.
IT company gifts to employees: తమ కంపెనీలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఐడియాస్2ఐటీ మార్కెటింగ్ హెడ్ హరి సుబ్రహ్మణ్యం తెలిపారు. సంస్థ గడించిన లాభాలను, సంపదను ఉద్యోగులకు తిరిగి ఇవ్వడమే తమ విధానమని చెప్పారు. సంస్థను మెరుగుపర్చేందుకు ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మురళి వివేకానందన్ పేర్కొన్నారు. ఇది ఉద్యోగులకు తాము ఇచ్చిన బహుమానం కాదని, వారి కష్టానికి దక్కిన ప్రతిఫలమని అన్నారు. వారు కార్లను తమ కష్టంతో సంపాదించుకున్నారని చెప్పారు. 'సంస్థ భారీ లక్ష్యాలను సాధించినప్పుడు సంపదను పంచిపెడతామని ఏడెనిమిదేళ్ల క్రితం ఉద్యోగులకు మాటిచ్చాం. కార్లను ప్రదానం చేయడం ఇందులో తొలి అడుగు మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం' అని వివేకానందన్ తెలిపారు.
మరోవైపు, కార్లను స్వీకరించిన ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సంస్థ నుంచి కానుకలు అందుకోవడం ఎప్పుడూ గొప్పగా అనిపిస్తుందని ప్రసాద్ అనే ఉద్యోగి చెప్పుకొచ్చారు. ఇదివరకు బంగారు నాణేలు, ఐఫోన్లను ఉద్యోగులకు కంపెనీ ఇచ్చిందని తెలిపారు. కార్లు ఇవ్వడం చాలా పెద్ద విషయమని అన్నారు. ఇదివరకు.. చెన్నైకే చెందిన సాఫ్ట్వేర్ సర్వీస్ సంస్థ కిస్‌ఫ్లో.. తమ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.కోటి విలువ చేసే కార్లను అందించింది.
ఇదీ చదవండి: టీసీఎస్ లాభాలు అదరహో.. త్రైమాసిక ఆదాయంలో మైలురాయి