మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా మరో కీలక అడుగు వేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన 1600 హౌసింగ్ ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఏఐఎఫ్) ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందిన నిర్ణయాలను ప్రకటించారు నిర్మల.
ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధికి ప్రభుత్వం రూ.10వేల కోట్లు అందించనుందని, మిగిలిన రూ.15వేల కోట్లను ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ సంయుక్తంగా సమకూర్చనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన 4.58 లక్షల ఇళ్లు, 1600 హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని చెప్పారు నిర్మల. ఎన్‌పీఏలతో పాటు దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ప్రాజెక్టులు సైతం ఈ నిధిని వినియోగించుకోవచ్చని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.
హౌసింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగాల కల్పనతో పాటు, సిమెంట్, స్టీల్‌కు డిమాండ్ పెంచి ఆయా రంగాల వృద్ధికి ఊతం కల్పించినట్లయింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పలు చర్యలు చేపడుతూ వస్తోన్న ప్రభుత్వం అందులో భాగంగా తాజాగా స్థిరాస్తి రంగంపై దృష్టి సారించింది.
"1600 హౌసింగ్ ప్రాజెక్టులు, 4.58 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయిన దశలో ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయదలచింది. దీనిని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి అని పిలుస్తాం. ఈ నిధికోసం ప్రభుత్వం రూ. 10వేల కోట్లు వెచ్చిస్తోంది. మిగతా నిధులను ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థల నుంచి తీసుకువస్తాం. ఆయా సంస్థల నుంచి రూ. 15 వేల కోట్లు సమకూర్చాలని నిర్ణయించాం. దీనితో ఈ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి రూ. 25వేల కోట్లకు చేరుతుంది.
-నిర్మల సీతారామన్, ఆర్థికమంత్రి
ఇదీ చూడండి: మహా ప్రతిష్టంభనకు తెర! త్వరలో ప్రభుత్వం ఏర్పాటు