వ్యాపార విస్తరణలో భాగంగా.. జస్ట్ డయల్‌ను సొంతం చేసుకోనుందని వస్తున్న వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ క్లారిటీ ఇచ్చింది. మీడియా ఉహగానాలకు సంబంధించి తాము స్పందించదలచుకోలేదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. కంపెనీ పలు అవకాశాలను పరిశీలిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇవ్వని సమాచారమేదీ లేదని పేర్కొంది.
రిలయన్స్, జస్ట్ డయల్ డీల్‌పై వార్తలు ఇలా..
స్థానిక వ్యాపార సంస్థల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు తెలిపే జస్డ్ డయల్‌ను (88888 88888) సొంతం చేసుకునేందుకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చర్చలు జరుపుతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి ఇరు వర్గాలు చర్చల్లో ఉన్నాయని ఆ వార్తల ద్వారా తెలిసింది. వ్యవస్థాపక ప్రమోటర్ల నుంచి 800-900 మిలియన్ డాలర్ల (రూ.6,000-6,750 కోట్లు) మొత్తానికి కొనుగోలు రిలయన్స్ భావిస్తోందని ఆ వార్తల్లో ఉంది.
జస్ట్ డయల్ ఎండీ వి.ఎస్.ఎస్. మణి, ఆయన కుటుంబానికి కంపెనీలో 35.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ రూ.2387.9 కోట్లుగా అంచనా. ముందుగా వీరి వాటా కొనుగోలు చేసి, ఆ తర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటా స్వాధీనం చేసుకోవాలన్నది రిలయన్స్ ప్రణాళిక అనేది ఇటీవలి వార్తల్లోని సారాంశం.
'ఓపెన్ ఆఫర్‌కు పూర్తి స్థాయి స్పందన లభిస్తే రిలయన్స్‌కు జస్ట్‌డయల్‌లో 60 శాతం వాటా లభిస్తుంది. తదుపరి కంపెనీలో జూనియర్ భాగస్వామిగా మణి ఉంటారు.' అని అంచనాలు వచ్చాయి. గతంలో టాటా సన్స్ కూడా ఈ కంపెనీతో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలవంతం కాలేదు.
ఇదీ చూడండి: భారత్‌లో 20 లక్షల ఖాతాలపై వాట్సప్ నిషేధం