2021-22 సంవత్సరానికి బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ లాంఛనంగా ప్రారంభించింది. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ రూపుదిద్దుకుంటోన్న ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహమ్మారి తీవ్రతకు రెవెన్యూ వసూళ్లు, వ్యయాలు, ఎగుమతులు, పెట్టుబడుల ఉపసంహరణపై తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం కానుంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం 10.3 శాతం మేర పతనం కానుంది. భారత ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని ఆర్బీఐ సైతం అంచనాలు వెలువరించింది. అన్ని ప్రతికూలతల నడుమ ఈ బడ్జెట్ తయారవుతోంది.
నెల రోజుల పాటు..
బడ్జెట్లో భాగంగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాలతో పాటు 2020-21 సంవత్సరానికి సవరించిన జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ షెడ్యూల్ ప్రకారం.. వీటిని తయారు చేసేందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టనుంది.
బడ్జెట్ తయారీకి శుక్రవారం ప్రారంభమైన ఈ సమావేశాలు నవంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. ఆర్థిక శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, హౌసింగ్, స్టీల్, పవర్ తదితర శాఖలకు చెందిన అధికారులు ఈరోజు సమావేశంలో పాల్గొన్నారు.
మోదీ రెండో హయాంలో, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మూడో పద్దు ఇది. ఫిబ్రవరి 1న బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానుంది.