ఎవరికి ఏ సందేహం వచ్చినా.. ఎక్కడ ఏం జరుగుతున్నా.. 'గూగుల్' మనకు చిటికెలో చెప్పేస్తుంది. చాలా మంది ఇంటర్నెట్ అంటే గూగుల్ మాత్రమేననుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం ఏ అవసరం వచ్చినా ముందుగా గూగుల్ వైపే చూస్తున్నారు. అందుకే చాలా మంది ముద్దుగా 'గూగుల్ తల్లి' అని పిలుచుకుంటారు. అంతటి ఆదరణ దక్కించుకున్న గూగుల్‌కు నేటితో (సెప్టెంబర్ 27) 23 ఏళ్లు నిండాయి.
గూగుల్ ఎలా ప్రారంభమైంది?
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్ధులైన ఇద్దరు విద్యర్థుల ఆలోచనే ఈ గూగుల్. ఆ ఇద్దరు విద్యార్థులే లారీ పేజ్, సెర్గి బ్రిన్‌లు. అప్పుడప్పుడే వరల్డ్ వైడ్ వెబ్ (WWW) మనుగడలోకి వస్తోంది. దీనిని మరింత మందికి చేరువచేయాలనే ఉద్దేశంతో.. 1998 సెప్టెంబరు 4న గూగుల్‌ను ప్రారంభించారు లారీ పేజ్, సెర్గి బ్రిన్‌లు. మొదటి ఏడేళ్లు ఇదే తేదీని గూగుల్ వార్షికోత్సవంగా జరిపారు. కానీ, రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్ 27ని అధికారిక వార్షికోత్సవ దినంగా జరుపుకుంటోంది గూగుల్. ఒక సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమై.. ఇప్పుడు వేలాది ఉత్పత్తులు (సాఫ్ట్వేర్), స్మార్ట్ఫోన్లు వ్యాపారాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఆండ్రాయిడ్ ఓఎస్ కూడా గూగుల్‌కు చెందినదే.
రోజూ ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా భాషల్లో బిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయి. 20కి పైగా డేటా సెంటర్లు నిరంతరాయ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థకు 2015లో భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ సీఈఓగా నియమితులయ్యారు.
గూగుల్ పేరుకూ ఓ కథ..
1920లో ఒక రోజు అమెరికన్ గణిత శాస్త్రవేత్త ఎడ్వర్డ్ కాస్నర్ తన మేనల్లుడు మిల్టన్ సిరోట్టాతో 1 తర్వాత వంద సున్నాలు ఉండే అంకెను ఎలా పిలవాలో సూచించమని కోరాడట. అందుకు మిల్టన్ గూగోల్ (Googol) అని సమాధానం ఇచ్చాడట. తర్వాత ఆ పదాన్ని కాస్నర్ 1940లో తాను ఉపరచయితగా వ్యవహరించిన 'మేథమెటిక్స్ అండ్ ఇమేజినేషన్' అనే పుస్తకంలో ప్రస్తావించారు. 1998లో లారీ, బ్రిన్‌లు తమ కంపెనీకి పేరు పెట్టడం కోసం వెతుకుతున్నప్పుడు గూగోల్ గురించి విన్నారట. ఆ పేరు వారికి ఎంతో నచ్చడం వల్ల.. చిన్న చిన్న మార్పులతో గూగుల్ అని పెట్టారట. అంటే సమాచార అన్వేషణకు అంతు లేదు అనేది పేరు వెనక ఉద్దేశం. తర్వాతి కాలంలో ఆ పదం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనితో 2006లో అధికారికంగా గూగుల్ అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు.
ఇదీ చదవండి: సెర్చ్ ఇంజిన్లందు గూగుల్ వేరయా! కానీ ఎందుకు?